హైదరాబాద్: విశాఖపట్నం జిల్లాకు చెందిన సీనియర్ నేత గండి బాబ్జీ పేరు చెప్పగానే ‘నాయక్’ సినిమాలో రాహుల్ దేవ్ పోషించిన పాత్ర, ఆ కామెడీ గుర్తుకు రాక మానదు. ఆ పాత్రకు ఆ పేరు పెట్టటంపై ఆ సినిమా విడుదల సమయంలో పెద్ద గొడవ జరిగింది కూడా. బాబ్జీ అనుచరులు నాయక్ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిజ జీవితంలో గండి బాబ్జీని ఉద్దేశించి ఆ పాత్ర రూపొందించలేదని వినాయక్ వివరణ ఇవ్వటంతో బాబ్జీ శాంతించారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశంలో చేరుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణతో కలిసి ఇవాళ తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిశారు. విశాఖజిల్లాకే చెందిన మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వీరిని బాబు దగ్గరకు తీసుకెళ్ళారు. వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్లో మంత్రిగా చేసిన కొణతాల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి జగన్ పార్టీలో చేరారు. అయితే విశాఖపట్నం జిల్లాకు చెందిన దాడి వీరభద్రరావును పార్టీలో చేర్చుకోవటంపై కినుక వహించి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. గండి బాబ్జీ సంవత్సరం క్రితమే వైసీపీకి రాజీనామా చేశారు. అయితే టీడీపీలో వీరిద్దరి చేరిక విశాఖకే చెందిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఇష్టంలేదని అంటున్నారు.