హైదరాబాద్: స్విస్ ఆర్మీ నైఫ్‌లకు పేరుగాంచిన ‘విక్టోరినాక్స్’ కంపెనీ తయారు చేసిన ఐనాక్స్ వాచ్‌ను మీరు పదిమీటర్ల ఎత్తునుంచి కాంక్రీట్ ఉపరితలంపై పడేసినా అది చెక్కు చెదరదు. 64 టన్నుల యుద్ధ ట్యాంక్ దానిమీదనుంచి వెళ్ళినా శుభ్రంగా పనిచేస్తుంది. వాషింగ్ మెషిన్‌లో రెండుగంటలు వేసిఉంచినా ఏమీ కాదు. 200 మీటర్ల లోతు నీళ్ళలో కూడా ఒక్క చుక్క వాచ్ లోపలికి ప్రవేశించదు. పటిష్ఠమైన 43ఎంఎం ఉక్కుతో ఈ వాచ్‌ను రూపొందించారు. డయల్‌ను ఒక సింగిల్ సీల్డ్ పీస్‌గా తయారు చేశారు. పైన గ్లాస్‌కు సఫైర్ క్రిస్టల్ వాడారు. ఇండెక్స్‌లను వాచ్‌లోనే స్టాంప్ చేశారు. అసాధారణమైన కుదుపులకు, కంపనాలకు, ఉష్ణోగ్రతా మార్పులకు, మంటలకు తట్టుకునేవిధంగా రూపొందించారు. పర్వతారోహకులతో సహా ఎలాంటి వృత్తులవారైనా ధరించటానికి అనువుగా దీనిని తయారు చేశారు. కంపెనీ వెబ్‌సైట్‌లో – వివిధ పరీక్షలను ఈ వాచ్ ఎదుర్కొన్న తీరును వీడియాలలో ప్రదర్శించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఈ విక్టోరినాక్స్ కంపెనీ 1884 నుంచి స్విస్ నైఫ్‌లను తయారుచేస్తోంది. 1989 నుంచి వాచ్‌ల తయారీ ప్రారంభించింది. దీని ధర రు.30,000 మాత్రమే.