హైదరాబాద్: ఈ నెల 18న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్కు గురైననాడు ఆమె దళిత ఎమ్మెల్యే అనితను కూడా వ్యక్తిగతంగా దుర్భాషలాడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రోజుకొకళ్ళతో పడుకుంటావని, మొగుడిని వదిలేశావని నాడు రోజా అనితను దుర్భాషలాడినట్లు తెలిసింది. ఆ వ్యాఖ్యలను అనిత ఇవాళ అసెంబ్లీలో చెప్పి కంటతడి పెట్టుకున్నారు. రోజా వ్యాఖ్యలపై తాను వ్యక్తిగతంగా హైకోర్టుకు వెళతానని, ఎస్సీ-ఎస్టీ కమిషన్కు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తానని అనిత అసెంబ్లీ బయట చెప్పారు. రోజా గత అసెంబ్లీ సమావేశాలలో మంత్రి పీతల సుజాతను కూడా ఇలాగే దుర్భాషలాడిన సంగతి తెలిసిందే.
రోజా వ్యాఖ్యలపట్ల ఎలా స్పందించాలో తెలియక రెండురోజులపాటు ఇంట్లోనే ఉన్నానని పాయకరావుపేట ఎమ్మెల్యే అయిన అనిత చెప్పారు. భర్తను వదిలేయటం తప్పా అని అడుగుతూ, తాను కావాలని భర్తను వదిలేయలేదని వ్యాఖ్యానించారు. ఇవాళ తనకు జరిగిందని, రేపు జగన్ భార్యకు, తల్లికి కూడా అవుతుందని అన్నారు. కుటుంబానికి ఏం సమాధానం చెప్పుకోవాలని అడిగారు. అగ్రవర్ణ ఎమ్మెల్యేతో తమను తిట్టించటమేకాక, ఆమె సస్పెన్షన్పై సభాసమయాన్ని జగన్ వృథా చేయటం ఎంతవరకు సమంజసమని అడిగారు. తనకు జరిగిన అన్యాయం మరెవరకీ జరగకూడదని అన్నారు. రోజా గతంలో మంత్రి పీతల సుజాతకు చీర ఎత్తి కాళ్ళు చూపిస్తూ తన కాలిగోటికి సరిపోవని అన్నారని, గోరంట్ల బుచ్చయ్యచౌదరిని, మంత్రి అచ్చెన్నాయుడును, మంత్రి గంటా శ్రీనివాసరావును కూడా దుర్భాషలాడారని గుర్తు చేశారు. తాను గౌరవనీయమైన ఉపాధ్యాయ పదవినుంచి వచ్చానని, రోజా ఎక్కడనుంచి వచ్చిందో అందరికీ తెలుసని అన్నారు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, రోజా భాష సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, ఆమెకు అసెంబ్లీలో ఉండే అర్హత లేదని అన్నారు. గతంలో తమపైకి చెప్పు తీసుకొచ్చిందని చెప్పారు. మహిళా మంత్రి పీతల సుజాతను పందికొక్కు అని సంబోధించిందని అన్నారు. ఏడాది కాదు పూర్తి కాలానికి సస్పెండ్ చేయాలని కోరారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, ఏడాదిపాటు రోజా సస్పెన్షన్ ఎక్కువేమోనని తాను ఆ రోజు సభలో వ్యాఖ్యానించానని, ఇవాళ అనిత ప్రసంగం విన్న తర్వాత నాటి వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ, రోజా తానొక మహిళ అనే విషయాన్ని మర్చిపోయారని ఆరోపించారు. దళిత మహిళలు గుణవంతులు కాదని వైసీపీ పార్టీ ఉద్దేశ్యమా అని ప్రశ్నించారు. వ్యక్తిగత అంశాలను సభలో ప్రస్తావించటం ససబబు కాదని చెప్పారు. దళితులపై జగన్కు అభిమానం ఉంటే రోజాను పార్టీనుంచి సస్పెండ్ చేయాలని అన్నారు. రోజా జీవితంలో అసెంబ్లీకి పోటీచేయకుండా నిర్ణయం తీసుకోవాలని సూచించారు.