హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ సాయంత్రంతో ముగిశాయి. ఐదు రోజులపాటు సాగిన సమావేశాలు ఇవాళ నిరవధిక వాయిదా పడ్డాయి. ఎనిమిది బిల్లులను ఈ సమావేశాలలో ఆమోదించారు. 26 గంటల 8 నిమిషాల పాటు సభ జరిగింది. 49 ప్రశ్నలను చర్చించారు. చర్చకు రాని ప్రశ్నలకు రాతపూర్వకంగా సమాధానాలు ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు. కాల్‌మనీ, కల్తీమద్యం వంటి ఐదు అంశాలపై ప్రభుత్వం ప్రకటనలు చేసింది.
ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన ఈ ఆరవ అసెంబ్లీ సమావేశాలు ఒకరకంగా సంచలనం సృష్టించాయి. అసెంబ్లీ విజయవాడ కాల్‌మనీ వ్యవహారంపై సభ దద్దరిల్లటం, ఆ గొడవలో రోజా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీటువద్దకు వెళ్ళి అనుచిత వ్యాఖ్యలు చేయటం, ఆమెపై ప్రభుత్వం ఏడాదిపాటు సస్పెన్షన్‌ను ప్రతిపాదించటం, దానికి సభ ఆమోదం ప్రకటించటం, దీనికి నిరసనగా వైసీపీ పార్టీ సెషన్‌ను బాయ్‌కాట్ చేయటం, టీడీపీ ఎమ్మెల్యే అనితపై రోజా వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి రావటం వంటి పరిణామాల వలన ఆరవ అసెంబ్లీ సమావేశాలు గుర్తుండిపోతాయి. రోజా సస్పెన్షన్‌కు నిరసనగా వైసీపీ కోర్టుకు వెళ్ళాలని, స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనికూడా యోచిస్తోంది. ఇవాళ జరిగిన వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో స్పీకర్ కోడెలపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రేపు అసెంబ్లీ కార్యదర్శికి అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇవ్వనున్నారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించటంలేదు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చెప్పారు.