నిర్భయ కేసులో బాల నేరస్తుడికి కేవలం మూడేళ్ళ శిక్ష విధించి బయటకు విడిచిపెట్టినందుకు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో, రాజకీయ పార్టీలు కూడా అందుకు అనుగుణంగా స్పందిస్తూ ఈరోజు రాజ్యసభలో బాల నేరస్తుల చట్టంపై లోతుగా చర్చించి ఆమోదించాయి. ఇంతవరకు 18 సం.ల లోపు ఉన్నవారిని బాలనేరస్థులుగా పరిగణించేవారు. కానీ సవరించిన బాల నేరస్తుల చట్ట ప్రకారం సవరించిన ఆ చట్టం ప్రకారం ఇక నుండి 16 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న బాలనేరస్థులను కూడా పెద్దవారిగా పరిగణించి కోర్టులు శిక్షలు వేస్తాయి.
సిపిఐ (ఎం), డిఎంకె మరియు ఎన్.సి.పి తప్ప మిగిలిన అని పార్టీల సభ్యులు ఈ చట్ట సవరణలను సమర్ధించడంతో బిల్లు రాజ్యసభ ఆమోదం పొందగలిగింది. ఇక దానిని రాష్ట్రపతి ఆమోదించడం లాంచనప్రాయమే. ఆయన సంతకం చేసిన వెంటనే ఈ చట్టం అమలులోకి వస్తుంది.
ఇప్పుడు 16 సం.ల వయసున్న వారు కూడా హత్యలు, మానభంగాలు వంటి తీవ్రమయిన నేరాలు చేస్తున్నందున ఈ చట్ట సవరణలు అవసరమయ్యాయని మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. అయితే అంత చిన్న వయసులో తెలిసీ తెలియక చేసిన తప్పులకు వారి జీవితం బలయిపోకుండా చట్టంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొన్నామని ఆమె సభలో సభ్యులకి తెలిపారు.
ఏదయినా ఒక కేసులో బాల నేరస్తుడుని నిర్బందించినపుడు, అతను ఉద్దేశ్యపూర్వకంగానే ఆ నేరాన్ని చేశాడా లేక ఒక చిన్న పిల్లాడి మాదిరిగా తెలిసీ తెలియనితనంతో తప్పు చేసాడా? అనే విషయాన్ని బాలనేరస్థుల బోర్డులో నిపుణులు, మానసిక వైద్యులు విచారణ చేసి కనుగొంటారు. వారి నివేదిక ఆధారంగా కోర్టులు శిక్షలు ఖరారు చేస్తాయి. ఒకవేళ కోర్టులు వారిని దోషులుగా నిర్ధారించినప్పటికీ, వారిని నేరుగా పెద్ద ఖైదీలు ఉండే జైలుకి పంపించబోరు. వారికి 21 ఏళ్ల వయసు వచ్చే వరకు బాల నేరస్తుల పరివర్తన కేంద్రాలలో నిర్బందిస్తారు. బాల నేరస్తులను కరడుగట్టిన నేరస్తులతో కలిపి ఉంచడం మంచిది కాదనే ఉద్దేశ్యంతోనే చట్టంలో ఈ ఏర్పాటు చేసినట్లు ఆమె సభకు తెలిపారు. వారికి 21 ఏళ్ల వయసు వచ్చిన తరువాత కోర్టుకి అప్పగిస్తారు. అప్పుడు కోర్టులు తగు నిర్ణయం తీసుకొంటాయి. ఇది పరిపూర్ణమయిన మానవీయకోణం కలిగిన బిల్లు అని మేనకా గాంధీ అన్నారు. నేడు ఈ బిల్లుని ఆమోదించడం ద్వారా నిర్భయ కేసులో బాల నేరస్తుడిని శిక్షించలేకపోయినా, ఇకపై ఆ వయసు వారు అటువంటి హేయమయిన నేరాలకు పాల్పడకుండా ఈ బిల్లు ఒక నివారిస్తుందని తను భావిస్తున్నట్లు మేనకా గాంధీ తెలిపారు.