డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలకే జవాబు చెప్పుకోలేక సతమతమవుతున్న కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై స్వంత పార్టీకే చెందిన ఎంపి కీర్తి ఆజాద్ కూడా విరుచుకుపడుతుండటంతో ఇంకా ఇబ్బందికరర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. తనపై వస్తున్న ఆరోపణల కారణంగా తీవ్ర ఒతిడికి గురయిన అరుణ్ జైట్లీ వ్యక్తిగత హోదాలో అరవింద్ కేజ్రీవాల్ తో సహా ఆమాద్మీ పార్టీకి చెందిన మరో ఐదుగురుపై రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేసినపుడు, బీజేపీ దర్బంగా (బిహార్) ఎంపి కీర్తి ఆజాద్ తనపై కూడా పరువు నష్టం దావా వేయమని అరుణ్ జైట్లీకి సవాలు విసిరారు. ఆయన కూడా అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలు నిజమనట్లుగా మాట్లాడారు.
2000 నుంచి 2013సం.వరకు అరుణ్ జైట్లీ డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కి అధ్యక్షుడు ఉన్నప్పుడు క్రికెట్ స్టేడియం నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. కీర్తి ఆజాద్ స్వంత పార్టీకే చెందిన వ్యక్తి కావడం పైగా మాజీ క్రికెటర్ కూడా కావడంతో కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇదే అదునుగా పార్లమెంటు లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కలిసి అరుణ్ జైట్లీని తక్షణమే పదవిలో నుంచి తొలగించాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాయి.
బిహార్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుషీల్ కుమార్ మోడీ మీడియాతో మాట్లాడుతూ, “కీర్తి ఆజాద్ ప్రతిపక్షాల చేతిలో పావుగా మారినట్లు మాకు అనుమానం కలుగుతోంది. బహుశః అందుకే పార్టీలో, ప్రభుత్వంలో సీనియర్ అయిన ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై విమర్శలు చేస్తున్నట్లు మేము అనుమానిస్తున్నాము. పార్టీకి, ప్రభుత్వానికి చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టింస్తునందుకు కీర్తి ఆజాద్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నాము. అరుణ్ జైట్లీకి అండగా పార్టీ నిలబడుతుంది,” అని తెలిపారు.