తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో అట్టహాసంగా చేస్తున్న ఆయుత చండీ యాగం నేటి నుంచి మొదలవుతుంది. జగదేవ్ పూర్ లోని ఎర్రవల్లి గ్రామంలో కేసీఆర్ కి చెందిన వ్యవసాయ క్షేత్రంలో నేటి నుంచి ఐదు రోజులు ఈ యాగం జరుగుతుంది. రాష్ట్రపతితో సహా దేశవ్యాప్తంగా ఉన్న అనేక మంది ప్రముఖులను ఈ యాగానికి ఆహ్వానించారు. ఇంతవరకు ఎటువంటి గుర్తింపుకు నోచుకోని ఎర్రవల్లి గ్రామానికి ఈ చండీయాగం పుణ్యామాని మహర్దశ పట్టింది.
దేశం నలుమూలల నుంచి ప్రముఖులు తరలి వస్తునందున గ్రామానికి తారు రోడ్లు ఏర్పడ్డాయి. వీధి లైట్లు, మురికి కాలువలు వంటి ప్రాధమిక సౌకర్యాలన్నీ కొన్ని రోజుల వ్యవధిలోనే ఏర్పాటయ్యాయి. ఈయాగానికి వచ్చే అతిధుల కోసం ఐదు హెలిప్యాడ్ లు ఏర్పాటు చేసారు. ఈ యాగానికి వచ్చే ప్రముఖుల భద్రత కోసం ఏడుగురు పోలీస్ ఎస్.పిలు, ఆరుగురు ఏ. ఎస్.పిలు, 25 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 185 మంది ఎస్సైలు, 40 మంది మహిళ ఎస్సైలు, 300 మంది ఏ.ఎస్సైలు, 200 మంది హోం గార్డులు, 400 మంది కేంద్ర భద్రత బలగాలు, 400 మంది కానిస్టేబుళ్లను మొహరించారు.
ఈ యాగానికి సుమారు రూ.2-3కోట్లు వరకు ఖర్చవుతాయని కేసీఆర్ అన్నారు. ఈ యాగం కోసం ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోబోనని, పూర్తిగా తన స్వంత సొమ్ముతోనే యాగాన్ని నిర్వహిస్తానని కేసీఆర్ చెప్పుకొన్నారు. కానీ అది కేవలం యాగ నిర్వహణ వరకు మాత్రమే పరిమితమని మిగిలినదంతా ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్చు చేస్తున్నట్లు స్పష్టం అవుతోందిపుడు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాగానికి ఈ ఏర్పాట్లన్నీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు గత నెల రోజులుగా నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఈ యాగానికి సుమారు 100 కోట్లు వరకు ఖర్చు పెట్టి ఉండవచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ యాగం వలన దేశానికి మంచి జరుగుతుందో లేదో తెలియదు కానీ మా ఊరుకి చాలా మంచి జరిగిందని ఎర్రవల్లి గ్రామస్తులు సంతోషిస్తున్నారు.