హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీవినీ ఎరగని స్థాయిలో తమ ఫామ్ హౌస్లో అయుత చండీయాగాన్ని ఇవాళ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఐదు రోజులపాటు జరిగే ఈ యాగానికి అద్భుతమైన రీతిలో సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ యాగం మొత్తానికి కనీసం రు.20 కోట్లు ఖర్చవుతుందని ఒక అంచనా. అయితే కేసీఆర్ మాత్రం యాగానికి రు.7 కోట్లు ఖర్చవుతుందని, ఆ ఖర్చును తాను, తన బంధుమిత్రులు కొందరు పెట్టుకుంటున్నామని వివరణ ఇచ్చారు. ప్రభుత్వ ఖాతానుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టటం లేదని, జనరేటర్లు, ఆర్టీసీ బస్సుల కోసం కూడా తామే చెల్లిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఇవాళ యాగం ఖర్చుపై విమర్శలు గుప్పించారు. తెలంగాణలో ఒకపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ చండీయాగం కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నారని ట్విట్టర్లో పేర్కొన్నారు. కేసీఆర్ ఈ ఖర్చంతా తన సొంతమని అంటున్నారని, అయితే ఆ డబ్బు ఎక్కడనుంచి వచ్చిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. యాగంపై ఖర్చుపెట్టే బదులు ఆ డబ్బును ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు కేసీఆర్ ఇచ్చి ఉండాల్సిందని ట్వీట్ చేశారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని దిగ్విజయ్ పేర్కొన్నారు.