ప్రతిపక్షం చేతకాని తనం వల్లా, రోజుగడిస్తే చాలు అనే పాలకపక్షం బాధ్యతా రాహిత్యం వల్లా 5 రోజుల్లో 26 గంటల 8 నిమిషాలపాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ శీతాకాలపు శాసనసభా సమావేశాలు ఏకపక్షంగా నిరర్ధకంగా ముగిసిపోయాయి.
బాక్సైట్ తవ్వకాలపై పాతప్రభుత్వ జివో లను రద్దు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. బాక్సైటు వల్ల ఎంత ఆదాయం వస్తుందో వివరించారు.అంతే తప్ప తవ్వకాలను ఆపివేస్తామని ప్రకటించ లేదు. ఇది ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని బయటపెడుతోంది. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వేదిక అయిన శాసనసభలో సభానాయకుడైన ముఖ్యమంత్రే ఇలా కప్పదాటు వేయడం ప్రజల దౌర్భాగ్యమే!
ప్రతిపక్షం సభలో లేని అదునుగా రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే! విద్యార్థిసంఘాలు, విద్యావేత్తలు, ఆలోచనాపరులూ గట్టిగా వ్యతిరేకిస్తున్న ప్రయివేటు విశ్వవిద్యాలయాల బిల్లుతో వడ్డీ వ్యాపారుల బిల్లు, భూమిని యథేశ్చగా కార్పొరేట్లకు అప్పగించే మౌలిక సదుపాయాల బిల్లు, పట్టణ ప్రజలపై భారాలు మోపే మెట్రోపాలిటన్, రీజియన్ అర్బన్ అథారిటీ బిల్లు ఏకపక్షంగా దాదాపు చర్చే లెకుండా ఆమోదముద్ర వేసుకున్నాయి. ఈ బిల్లుల మీద ప్రతిపక్ష అభిప్రాయం, చర్చ లేదన్న వాస్తవం శాసనసభ రికార్డుల్లో శాశ్వతంగా వుండిపోతుంది.
విజయవాడలో కొందరు మహిళలపై వికృత కాండను పక్కనపెట్టి వడ్డీవ్యాపారం స్థాయికి కేసు తీవ్రతను తగ్గించి చూపడానికి తెలుగుదేశం శాసనసభను వేదికగా చేసుకుంది. తమకంటిన బురదను ఇతర పార్టీలపైనా చల్లడానికి శాసనసభలో సాక్షాత్తు ముఖ్యమంత్రే బరిలోకి దిగడం తాత్కాలిక ప్రయోజనాలే ఆ పార్టీ కి అతిముఖ్యమని చెప్పకనే చెబుతోంది.
ఒక వ్యూహం ప్రకారం అధికారపార్టీ ప్రణాళికా బద్ధంగా అమలు చేసిన ఈ వ్యూహాన్ని ఎదుర్కుని సజావుగా చర్చను సాగించాల్సిన సభలోని ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమైన తీరు బాధాకరం. ప్రజల సమస్యలను ప్రస్తావించి, సంయమనంతో సర్కారు దమననీతిని ఎండకట్టడానికి బదులుగా ఆవేశకావేశాలకు గురికావడంతో కాల్‌మనీ చర్చ పక్కదోవ పట్టింది. రోజా సస్పెన్షన్‌కు, ఆ తరువాత వైఎస్ఆర్సిపి సభ నుండి నిష్క్రమించడానికి కారణమైంది. కనీస చర్చ లేకుండా ఏకంగా ఏడాదిపాటు రోజాను సస్పెండ్ చేయడంలో అధికారపక్షపు అహంకారమే కనిపిస్తోంది. నిండుసభలో దీనిని ఎత్తిచూపి, నిలదీయడంలోనూ విపక్షం విఫలమైంది.
చంద్రబాబు మనసులో మాటను ప్రతిధ్వనింప జేయడానికి ఆయన వేవ్ లెంగ్త్ కి ట్యూన్ అయిన నాయకులు సభలో అనేక మంది వున్నారు. జగన్ కి ఆపరిస్ధితిలేదు. తాను చెప్పిందే పార్టీ వినాలి పార్టీ చెప్పేది తాను విననవసరం లేదన్న జగన్ ధోరణే ఇందుకు కారణం. తనమాట నెరవేరకపోతే సర్దుబాటు చేసుకోగల స్వభావం ఆయనకి లేదు. దీన్ని గుర్తించిన తెలుగుదేశం ఆయన్ని కవ్విస్తుంది. రెచ్చగొడుతుంది. ఫలితంగా ఆయన వాకౌట్ చేస్తారు. ఇది ప్రతీ సభా సమావేశంలోనూ జరుగుతున్నదే! రోజా కు మాటనిగ్రహం లేదు. ”నేను ఎవరితో పడితే వారితో పడుకోలేదు” అని సభలోనే అనగల తెంపరితనం ఆమెది. అటువంటి ”రోజా సస్పెన్షన్ ఉపసంహరించుకోకపోతే సభలో ఉండలేమని” నాయకుడైన జగన్ స్వయంగా ప్రకటించడమంటే డెడ్ ఎండ్ కి చేరుకోవడమే! సంఖ్యాబలం హెచ్చుగా వుండే అధికారపక్షంతో శాసనసభలో ఎప్పటికీ గెలవలేమన్న వాస్తవాన్ని ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికీ గుర్తించలేదు. మంత్రులతో మాట్లాడించి ఆమాటలనుంచే పాయింటులాగి అధికార పార్టీక ఊపిరాడకుండా చేయవలసిన ఓర్పు నేర్పు ప్రతిపక్షానికి వుండాలి. జగన్ పార్టీ కి అది లేకపోవడం కూడా ప్రజల దౌర్భాగ్యమే!
వరదలు, కరువు, ప్రాజెక్టుల పేరుతో విచ్చలవిడిగా సాగుతున్న భూ సేకరణ, పెరుగుతున్న నిరుద్యోగం, ఆగని రైతుల ఆత్మహత్యలు వంటి కీలక అంశాలు శాసనసభలో ప్రస్తావనకే రాలేదు. వివిధ రంగాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఆందోళనలు నామమాత్రంగా కూడా ప్రతిధ్వనించ లేదంటే సభ జరిగిన తీరును అర్ధంచేసుకోవచ్చు. ఈ తరహా సమావేశాలు రెండు రోజులుసాగినా, నెలల తరబడి కొనసాగినా పరనింద, ఆత్మస్తుతి తప్ప మరోకటి కనిపించదు. శాసనసభ సమావేశాలు నిష్క్రియాపరత్వంగామారడానికి ప్రతిపక్షం చేతగానితనమూ పాలకపక్షం బాధ్యతా రాహిత్యాలే కారణం.