హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీస్థాయిలో చేస్తున్న అయుత చండీ మహాయాగం ఇవాళ ఉదయం ప్రారంభమయింది. యజ్ఞగుండంవద్ద కేసీఆర్ దంపతులతో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా కూర్చున్నారు. మొదట కేసీఆర్ దంపతులతో గౌరీపూజ చేయించిన వేదపండితులు, అనంతరం వారిని ప్రధాన యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. తర్వాత యాగశాలకు తోడ్కొని వెళ్ళారు. యాగం ప్రారంభమైన కొద్ది సేపటికి గవర్నర్ దంపతులు అక్కడకు చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా యాగానికి హాజరయ్యారు. శృంగేరి పండితులతోపాటు మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ నుంచి దాదాపు 2 వేలమంది రుత్విక్కులు గురుపూజ నిర్వహించారు. ప్రతిరోజూ యాగాన్ని వీక్షించేందుకు దాదాపు 50 వేలమంది భక్తులు తరలివస్తారని నిర్వాహకుల అంచనా. వీరందరికి సరిపడేలా అమ్మవారి పసుపు, కుంకుమ, ప్రసాదంతోపాటు భోజన ఏర్పాట్లు కూడా చేశారు. మరోవైపు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు, ఆధ్యాత్మిక గురువు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ పండిట్ రవిశంకర్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.