దర్శకుడు సృజనకు ఆకాశమే హద్దు అనాలేమో.. తాము రాసుకున్న కథకు ఎవరైతే బాగుంటారో వారి కోసం అన్వేశించడంలో ఏమాత్రం సంకోచించరు. ప్రస్తుతం గుండెల్లో గోదారి దర్శకుడు కుమార్ నాగేంద్ర అలాంటి పనే చేశాడు. ఈ దర్శకుడు తను చేస్తున్న సినిమా హీరోయిన్ ని ఏకంగా న్యూజిల్యాండ్ నుండి రప్పించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళితే సినిమా కథ అనుకున్న దర్శకుడు కుమార్ నాగేంద్ర న్యూజిల్యాండ్ లో ఓ ఈవెంట్ లో పాల్గొనాల్సి వచ్చిందట.
అయితే ఆ ఈవెంట్ లో చురుగ్గా పాల్గొన్న ఓ అమ్మాయిని చూసి, తను రాసుకున్న కథనాయిక పాత్రకి అమ్మడు కరెక్ట్ గా సరిపోతుందని భావించి ఆమె అడ్రస్ కోసం చాలా కష్టపడ్డాడట. చివరగా ఆమె పేరు, ఊరు మిగతా విషయాలని కనిపెట్టి సినిమా ఆఫర్ ముందుంచారట. మొదట వీరిని నమ్మని అమ్మడు తనకు హైదరాబాద్ లో పరిచయం ఉన్న వారితో కనుక్కుని సినిమా ఓకే చేసిందట. ఇంతకీ ఈ వ్యవహారం అంతా జరిగింది ఏ హీరోయిన్ విషయంలో అంటే అదేనండి నారా రోహిత్ హీరోగా తెరకెక్కుతున్న తుంటరి సినిమాలో లక్కీ లతా హెగ్డె గురించి.
ప్రస్తుతం కథానాయికలు కొరత ఉన్న తెలుగు సిని పరిశ్రమలో లక్కీగా అడుగుపెట్టిన ఈ భామ సినిమా విడుదల కాకముందే అందరిని ఇంప్రెస్ చేస్తుంది. అంతేకాదు ఒక్క సినిమా కూడా విడుదలవ్వకముందే మరో రెండు మూడు సినిమా ఆఫర్స్ వస్తున్నాయట. మరి చూస్తుంటే అమ్మడు టాలీవుడ్ లో లతా హెగ్డె మంచి క్రేజ్ ని సంపాధించేట్టే ఉంది. న్యూజిల్యాండ్ వెళ్లిన కన్నడ కుటుంబం కావడం చేత అమ్మడికి సినిమా పరిశ్రమ మీద ముఖ్యంగా తెలుగు సినిమా మీద ప్రత్యేకమైన అభిమానం ఉందట. అంతేకాదు అమ్మడికి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే చాలా ఇష్టమంటుంది. మొత్తానికి సినిమా కథానాయిక ఎంపిక కోసం ఇంతకష్ట పడ్డ కుమార్ నాగేంద్ర తుంటరి ఏ విధంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.