హైదరాబాద్: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 2002లో ముంబై నగరంలో చేసిన యాక్సిడెంట్ కేసును సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో బాంబే హైకోర్ట్ ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. కోర్టు తీర్పుపై సల్మాన్ ఖాన్ కుటుంబసభ్యులు, మిత్రులు, అభిమానులు ఘనంగా సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే ఆ కేసు అప్పుడే ముగిసిపోలేదు. ఒక వ్యక్తి చనిపోయి మరికొందరు తీవ్రంగా గాయపడిన నాటి యాక్సిడెంట్ కేసులో హైకోర్ట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్ట్‌లో సవాల్ చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేసులో కింది కోర్ట్ సల్మాన్‌కు ఐదేళ్ళ జైలు శిక్షను విధించగా సల్మాన్ దానిపై హైకోర్ట్‌లో అప్పీల్ చేసుకున్నాడు. యాక్సిడెంట్ జరిగినపుడు సల్మాన్ కారు డ్రైవ్ చేస్తున్నాడనిగానీ, సల్మాన్ తాగి ఉన్నట్లుగానీ సరైన సాక్ష్యాధారాలు లేవనే కారణంతో హైకోర్ట్‌లో సింగిల్ జడ్జి ధర్మాసనం ఈ కేసును కొట్టేసింది. దీనిపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు, నిరసనలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కేసునుంచి బయటపడటంతో సల్మాన్ ఇక పెళ్ళికి కూడా సిద్ధమైనట్లు కూడా వార్తలొచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో మహారాష్ట్ర ప్రభుత్వం జనవరిలో అప్పీల్‌కు వెళ్ళాలని ఇవాళ నిర్ణయించటంతో సల్మాన్ కూడా తన పెళ్ళి నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుందేమో.