“గంటా శ్రీనివాసరావు తెదేపాలో చేరగా లేంది కొణతాల చేరితే తప్పేమిటి?”ఈ మాట అన్నది ఎవరో కాదు కొణతాల, గండి బాబ్జీని తెదేపాలో చేర్పిస్తున్న మంత్రి అయ్యన్న పాత్రుడు. మంత్రి గంటా శ్రీనివాసరావు వర్గానికి, అయ్యన్న వర్గానికి చాలా కాలంగా పొసగడం లేదనే విషయం పెద్ద రహస్యమేమీ కాదు. నిజానికి గంటా శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరుతునప్పుడు అయ్యన్న పాత్రుడు చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పుడు గంటా తన అనుచరులతో కలిసి సమావేశం పెట్టుకొని అందుకు చాలా బాధపడ్డారు కూడా. అప్పటి నుండి రెండు వర్గాల మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది.
కొణతాల రామకృష్ణ, గండి బాబ్జి ఇద్దరూ వైకాపాను వీడిన తరువాత వారిని తెదేపాలోకి తీసుకువద్దామని అయ్యన్న అప్పుడే ప్రయత్నించారు. కానీ అప్పుడు గంటా శ్రీనివాసరావు అడ్డుకోగలిగారు. కానీ ఈసారి గుట్టు చప్పుడు కాకుండా వారిద్దరినీ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ చేసేసారు. దానితో చంద్రబాబు నాయుడు తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా తమ రాజకీయ ప్రత్యర్ధులను పార్టీలోకి తీసుకొంటున్నారని గంటా వర్గం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీడియా అయ్యన్న పాత్రుడు దృష్టికి తెచ్చినప్పుడు అయన పైవిధంగా జవాబిచ్చారు. గంటా చేరిక పట్ల తాము అభ్యంతరాలు వ్యక్తం చేసామని, కానీ పార్టీ విస్త్రుత ప్రయోజనాల దృష్ట్యా అధిష్టానం నిర్ణయానికి తల వంచామని అన్నారు. కనుక ఇప్పుడు వేరెవరో వచ్చి పార్టీలో చేరుతుంటే దానికి గంటా శ్రీనివాసరావు ఎందుకు అభ్యంతరం చెపుతున్నారు? అని అయ్యన్న పాత్రుడు ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా?