బాహుబలి-2 చిత్రీకరణ ప్రారంభమైంది. మరోపక్క పాటల రికార్డింగ్ కూడా చకచకా జరిగిపోతున్నది. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే… పాప్ సెన్సేషన్ డాలెర్ మేహెంది తో ఒక పాటని నాలుగు భాషల్లో పాడించినట్లు తెలుస్తోంది. అధికారికంగా రాజమౌళి ఈ విషయాన్ని ధ్రువీకరించకపోయినా, బాహుబలి -2 షూటింగ్ స్పాట్ లో రచయిత మదన్ కర్కీ తో కలసి కనిపించాడు. మదన్ కర్కీ బాహుబలి పార్ట్ 1 తమిళవర్సెన్ కు డైలాగ్ రైటర్ గా ఉన్నాడు. అంతేకాదు, మదన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఒక పాట రికార్డింగ్ లో డాలెర్ మేహెంది తో సందడి చేశానంటూ ట్వీట్ చేస్తూ ఫోటో పోస్ట్ చేశాడు. పాపులర్ పాప్ సింగర్ తో కలసి పనిచేయడం తనకెంతో ఆనందం కలిగించిందని కూడా చెప్పుకొచ్చాడు.
ఇదే విషయాన్ని డాలెర్ మేహెంది తన ట్వీట్ లో ధ్రువీకరిస్తూ, కీరవాణి, మదన్ తో కలిసి బాహుబలి -2 కోసం నాలుగు భాషల్లో పాడటం ఓ చక్కటి అనుభవమంటూ ట్వీట్ చేశాడు. దీంతో రాజమౌళి చెప్పకపోయినా, అసలు సంగతి బయటకు పొక్కేసింది. సంగీత దర్శకుడు కీరవాణి ప్రస్తుతం బాహుబలి -2 సినిమా వర్క్ లో బిజిగా ఉన్నారు. కీరవాణి గతంలో కూడా డాలెర్ మేహెందితో `మగధీర’లో జోర్సే…అన్న పాటతోపాటు, `యమదొంగ’ సినిమాలో `రబ్బరు గాజులు’ పాటని పాడించారు.
కాగా, బాహుబలి -2 సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ తో పాటుగా, షూటింగ్ కూడా చురుగ్గా సాగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటిలో బాహుబలి బృందం సందడి చేస్తోంది. ప్రభాస్, రమ్యకృష్ణలపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మదన్ కర్కీ బాహుబలి -1లో కాలకేయ నాయకుడి కోసం `కిలికి’ అనే కొత్త భాషను తయారుచేసి రాజమౌళికి ఇచ్చాడు. బాహుబలి -2లో అతను ఒక పాట రాసినట్లు చెబుతున్నారు. ఆ పాటనే డాలెర్ మేహెంది పాడినట్లు ట్విట్టర్ సందేశాల ద్వారా అర్థమవుతోంది. డాలెర్ మేహెంది భాంగ్రాతో అందర్నీ ఉర్రూతలూగిస్తున్నాడు. దీంతోపాటుగా పాప్ సింగర్ గా పాపులర్ అయ్యాడు.
`బోలో తా రా రా’ అతని తొలి మ్యూజికల్ ఆల్బమ్. ఈ ఆల్బమ్ లక్షలకొద్దీ కాపీలు అమ్ముడైంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పాపులరయ్యాడు. ఇతను పర్యావరణవేత్త. డాలెర్ మేహెంది ఢిల్లీలో గ్రీన్ డ్రైవ్ లో చురుగ్గా పాల్గొన్నాడు. గమ్మత్తైన కంఠస్వరం, వేగంగా పాడే నైజం అతణ్ణి మహా గాయకునిగా తీర్చిదిద్దాయి. ఇక ఇప్పుడు మరో అద్భుతమైన పాట బాహుబలి-2లో చోటుచేసుకున్నట్లే.