బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కి అనుకూలంగా బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీం కోర్టులో సవాలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకొంది. త్వరలోనే దాని కోసం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లు బోంబే హైకోర్టుకి నిన్న తెలియజేసింది. బాంబే హైకోర్టు సల్మాన్ ఖాన్ని నిర్దోషి అని ప్రకటించి, అతనికి దిగువ కోర్టు విధించిన ఐదేళ్ళ కారాగార శిక్షను కూడా రద్దు చేసినప్పుడు, దానిని మహారాష్ట్రకు చెందిన ఒక లాయర్ సుప్రీం కోర్టులో సవాలు చేయగా, ఆ కేసులో తాము కలుగజేసుకోలేమని తేల్చి చెప్పింది. దానిని బట్టి ఈ కేసులో సుప్రీం కోర్టు వైఖరిని అర్ధం చేసుకోవచ్చును. కనుక మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో మళ్ళీ న్యాయపోరాటం చేయాలనుకొంటునప్పటికీ, సుప్రీం కోర్టు కూడా సల్మాన్ ఖాన్ నిర్దోషి అనే ప్రకటించే అవకాశం ఉందనే స్పష్టం అవుతోంది.
సుమారు ఒక దశాబ్ధంపైగా ఈ కేసునుచాలా లోతుగా విచారించిన తరువాతనే దిగువ కోర్టు సల్మాన్ ఖాన్ దోషి అని నిర్ధారించి శిక్ష విధించింది. కానీ దిగువకోర్టు అభిప్రాయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. సల్మాన్ ఖాన్ న్ని దోషి అని నిరూపించే బలమయిన సాక్ష్యాధారాలు లేనందున అతనిని నిర్దోషిగా ప్రకటించి, అతనికి విధించిన శిక్షను కూడా రద్దు చేసింది. అయితే అసలు కారణం అందరూ ఊహించగలరు. కానీ దానిని బయటకు చెప్పుకోలేము కనుక బోంబే హైకోర్టుకి కనబడని బలమయిన సాక్ష్యాధారాలను మళ్ళీ కూడగట్టుకొన్న తరువాతే మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్లడం మంచిదేమో? లేకుంటే మొదట్లోనే కేసు వీగిపోవచ్చును.