హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఈ నెల 18న జరిగిన గొడవ తాలూకు క్లిప్పింగ్స్ కొన్ని మూడురోజుల క్రితం సోషల్ మీడియాలో రావటం దురదృష్టకరమని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఆయన ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. రోజా వ్యాఖ్యల క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలోకి రావటం బాధ్యతా రాహిత్యమని, దీనిపై దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని అన్నారు. నిన్న ప్రభుత్వ విప్, టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ అనుమతితో ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు చెప్పారని, తాను అలా చెప్పలేదని తెలిపారు. 18వ తేదీన అసెంబ్లీ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని అన్ని పార్టీలవారికీ ఇచ్చామని, వారేం చేసుకుంటారో వారి ఇష్టమని చెప్పారు. రోజా సస్పెన్షన్ తన నిర్ణయం కాదని, సభ నిర్ణయమని అన్నారు. తాను ఒక పార్టీకి కొమ్ము కాయాల్సిన అవసరం లేదని చెప్పారు. తాను ఏకగ్రీవంగా ఎన్నికయ్యానన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని అన్నారు. తనపై వైసీపీ అవిశ్వాస తీర్మానం గురించి మాట్లాడుతూ, అది వారి హక్కు అని, పెట్టుకోవచ్చని చెప్పారు.
అసెంబ్లీ ప్రొసీడింగ్స్ వీడియో లీకేజి వ్యవహారం, రోజా సస్పెన్షన్ మొదలైన అంశాలపై చర్చించటానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నానని కోడెల తెలిపారు. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలలోని ఒక్కొక్కరిని ఈ కమిటీలో సభ్యులుగా నియమిస్తామని చెప్పారు. రోజా సస్పెన్షన్ పెంచాలన్నా, తగ్గించాలన్నా ఆ కమిటీదే తుది నిర్ణయమని అన్నారు. ఈ కమిటీ వచ్చే అసెంబ్లీ సమావేశాలనాటికి తన నివేదికను తయారు చేస్తుందని, ఆ నివేదికను ప్రివిలేజ్ కమిటీకి సమర్పిస్తుందని కోడెల చెప్పారు.