హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ రంగానికి సంబంధించి త్వరలో మిగులు రాష్ట్రంగా మారబోతోంది. దీనితో దక్షిణాదిలో విద్యుత్ రంగంలో మిగులు రాష్ట్రంగా రికార్డులలోకి ఎక్కబోతోంది. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ ప్లాంట్ విస్తరణ, హిందూజా ధర్మల్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్ర విద్యుత్ రంగ ముఖచిత్రమే మారిపోనుంది. డిమాండ్ తీవ్రంగా ఉండే వేసవి కాలంలో కూడా 500 మెగావాట్ల విద్యుత్ మిగులులో ఉంటుంది. ఆ విద్యుత్‌ను బయటకు అమ్ముకోవచ్చని ఏపీ ట్రాన్స్‌కో సంస్థ తాజాగా రూపొందించిన ఒక నివేదికలో పేర్కొన్నారు. కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం విస్తరణ వలన రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు 800 మెగావాట్ల విద్యుత్ సమకూరనుంది. ఇటీవల పనులు ప్రారంభమైన హిందూజా విద్యుత్ ప్లాంట్ నుంచి ఈ నెలాఖరు నుంచి 520 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. దానికి తోడు ఏపీ ఇటీవల నేషనల్ గ్యాస్ పూలింగ్ స్కీమ్‌లో చేరటంవలన ప్రతిరోజూ 430 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగించుకోవటానికి అవకాశం కలిగింది.
మరోవైపు విజయవాడలోని, రాయలసీమలోని ధర్మల్ విద్యుత్ కేంద్రాలను కూడా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి విస్తరణ పనులు 2017కు పూర్తవుతాయి. వీటిద్వారా రాష్ట్ర గ్రిడ్‌కు 1,050 మెగావాట్ల విద్యుత్ అదనంగా చేకూరుతుంది. ఇదిలా ఉంటే అనంతపూర్‌లోని రెండు భారీ సోలార్ విద్యుత్ కేంద్రాలు పూర్తి కావస్తున్నాయి. వీటి ద్వారా 500 మెగా వాట్ల విద్యుత్ రాష్ట్ర గ్రిడ్‌కు వచ్చి చేరుతుంది. విభజన వలన రాష్ట్రానికి జరిగిన ప్రయోజనం ఇదొక్కటే కనిపిస్తోంది. సంయుక్త రాష్ట్రంలో విద్యుత్ అంతా హైదరాబాద్‌కే పోవటం వలన ఏపీలో పల్లెల్లో పవర్ కట్లు తీవ్రస్థాయిలో ఉండేవన్న విషయం తెలిసిందే. ఇప్పుడు పవర్ కట్లన్నవి ఏపీలో లేకుండా పోయాయి.