హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ జరిగిన తీరుపై లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. సమావేశాలు ఇలా జరగటం దురదృష్టకరమని అన్నారు. ప్రజలలో నగుబాటుకు గురవుతున్నాయని వ్యాఖ్యానించారు. జేపీ ఇవాళ అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. రాజకీయాలంటే ద్వేషం కలిగేలా నాయకులు ప్రవర్తించారని అన్నారు. రాజకీయాలను వ్యాపారం చేశారని, రాజకీయ అండ చూసుకుని బ్లాక్ మెయిల్, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కాల్‌మనీ వ్యవహారంలో మహిళలను తీవ్రంగా అవమానించటం దారుణమని అన్నారు. ఈ విషయంలో మూలాల్లోకి వెళ్ళి విచారణ చేయాలని, పైపైన చేస్తే లాభం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాల వల్లే కాల్‌మనీ గ్యాంగులు పెట్రేగిపోతున్నాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికార, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని జేపీ చెప్పారు.