కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీపై డిడిసిఏ నిధుల దుర్వినియోగం చేసినట్లు వస్తున్న ఆరోపణలు, ఆయనపై విమర్శలు చేసినందుకు బీజేపీ ఎంపి కీర్తి ఆజాద్ ని పార్టీ నుండి సస్పెండ్ చేయబడటం వంటి పరిణామాలపై బీజేపీ సీనియర్ నేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్, యశ్వంత్ సిన్హా నేడు చర్చించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం సరికాదని, ప్రధాని నరేంద్ర మోడి లేదా బీజేపీ సీనియర్ నేతలతో ఏర్పాటు చేయబడిన మార్గదర్శక మండలి కలుగజేసుకొని తనకు న్యాయం చేయాలని కీర్తి ఆజాద్ చేసిన విజ్ఞప్తి చేసారు.
ప్రధాని మోడీ ఆ విజ్ఞప్తిని పట్టించుకోకపోవడంతో మార్గదర్శక మండలిలో సభ్యులయిన అద్వానీ, మురళీ మనోహర్ జోషి పార్టీలో సీనియర్ నేతలయిన శాంత కుమార్ మరియు యశ్వంత్ సిన్హాలతో బీజేపీకి అప్రదిష్ట కలిగిస్తున్న ఈ అవినీతి ఆరోపణల గురించి, ఆజాద్ చేసిన విజ్ఞప్తిపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే సమావేశం ముగుసిన తరువాత వారు ఎటువంటి ప్రకటన చేయలేదు. బహుశః ఈ సంఘటనలపై తమ అభిప్రాయాలను తెలియజేస్తూ రేపు ప్రభుత్వానికి లేదా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకి లేఖ విడుదల చేయవచ్చని పార్టీ నేతలు భావిస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ జైట్లీకి మద్దతుగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ‘హవాల కేసులో లాల్ కృష్ణ అద్వానీలాగ’ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొంటారని చెప్పడంతో ఈ పరిణామాలపై అద్వానీ తప్పకుండా స్పందించవచ్చని అందరూ భావిస్తున్నారు.