దత్తాత్రేయ జయంతి
శ్రీమన్నారాయణుడి అవతారమైన దత్తాత్రేయుడు ఆత్మవిద్యను బోధించడానికే ఈ భూమిమీద అవతరించారు. మహావిష్ణువే అన్ని అవతారాలకు మూలవిరాట్టు. ఆయన నుంచే సమస్త లోకాలు ఆవిర్భవించాయి. నారాయణడు ఏకవింశతి (21) అవతారాలు ఎత్తారు. వాటిలో మొదటి అవతారంలో సనక, సనంద, సనాతన, సనత్కుమారులనే మహర్షులుగా కఠోరమైన బ్రహ్మచర్యంతో సంచరించడం.
ఆది విష్ణువు రెండవ అవతారమైన `యజ్ఞవరాహ’తో భూమండలాన్ని ఉద్ధరించారు. మూడవ అవతారంగా నారదుడనే దేవర్షిగా జన్మించి వైష్ణవ ధర్మాన్ని బోధించారు. నాలుగవ అవతారంగా నరనారాయణలు, ఐదవ అవతారంగా కపిల మహర్షి, ఆరో అవతారంగా అత్రి-అనసూయలకు దత్తాత్రేయునిగా జన్మించినట్లు మహాభాగవతం చెబుతోంది. దత్తాత్రేయులవారు అలర్కుడు, ప్రహ్లాదుడు మొదలైనవారికి ఆత్మవిద్యను ప్రబోధించారు. ( శ్రీమహా విష్ణువు మిగతా అవతార క్రమం గురించి తర్వాత చెప్పుకుందాం )
అనసూయాదేవి అత్రిమహర్షికి భార్యయై, మహా పతివ్రతగా ప్రసిద్ధి చెందింది. ఆమె పాతివ్రత్యమహిమను తెలుసుకోగోరి త్రిమూర్తులు అత్రిమహాముని ఇంటలేని సమయంలో అతిథి వేషాల్లో వెళ్ళారు. వారు కోరిన షరతుకు అంగీకరించిన అనసూయ త్రిమూర్తులను చంటిపాపలుగా మార్చి వారికి స్తన్యమిచ్చి ఆకలి తీర్చింది. అలా చంటిపాపలుగా మారిన త్రిమూర్తులు ఆమెలోని పాతివ్రత్య మహిమను గ్రోలి విశ్రాంతి తీసుకున్నారు. అత్రి మహర్షి వచ్చి, విషయం తెలుసుకుని భార్య కోరిక మేరకు, ఈ ముగ్గురినే తమ బిడ్డలుగా ప్రసాదించమని త్రిమూర్తులను వేడుకున్నాడు. అప్పుడు త్రిమూర్తులు కూడా `మహర్షీ, మాకు మేముగా సంపూర్ణంగా నీకు దత్తం చేసుకుంటున్నాం’ అని పలికారు. అప్పటి నుంచి దత్తాత్రేయులుగా వారు అత్రి-అనసూయ దంపతుల ఇంట పెరిగారు. దత్తుగా వచ్చారు కనుక `దత్త’ అన్న పదం, అత్రిమహర్షి సంతానంగా భావించడం వల్ల `అత్రేయులు’ అన్న పదం – ఈ రెండూ కలిపి దత్తాత్రేయులుగా ఈ మువ్వురు ప్రసిద్ధి చెందారు. ఈ ముగ్గురూ బ్రహ్మ,విష్ణు,మహేశ్వురుల్లా వెలుగొందారు. బ్రహ్మ అంశతోనూ, శివ అంశతోనూ పుట్టిన బిడ్డలు తపస్సు నిమిత్తం వెళ్తూ, వారి తేజస్సును విష్ణు అంశతో పుట్టిన దత్తుడిలో మిళితం చేశారు. అప్పటి నుంచి దత్తుడు మూడు మూర్తుల అవతారంగా దత్తాత్రేయ మూర్తిగా విరాజిల్లాడు.
ఈ అవతారం విశిష్టమేమంటే, విష్ణు మూర్తి మిగతా అవతారాలకు వారివారి కార్యాలు తీరగానే సమాప్తి ఉంటుంది. కానీ నారదుని తర్వాత ఎప్పటికీ అవతార సమాప్తి లేనిది దత్తాత్రేయ అవతారమే. నారదుడు తన కార్యంలో భాగంగా వైష్ణవ ధర్మాన్ని భోదిస్తూనే ఉంటారు. అలాగే, దత్తాత్రేయులవారు సర్వజనోద్ధరణ కోసం అవతరించారు కనుక, భూమిపై జనులు ఉన్నంతవరకూ ఆయన సంచరిస్తూనే ఉంటారు. భక్తులను అనుగ్రహిస్తూనే ఉంటారు. ఇతర అవతారాల్లో నిర్ధేశించిన కార్యాలు తీరగానే అవతార సమాప్తి జరిగింది. శ్రీ రాముడు రావణాది రాక్షుసులను సంహరించడం కోసం పుట్టాడు. అలాగే శ్రీ కృష్ణుడు దుష్టులను సంహరించి ధర్మాన్ని కాపాడటం కోసం అవతారమెత్తారు. అలాగే మత్స్య , కూర్మావతారాలు కూడా.
సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపించి వారికి భక్తి బోధన చేయడం కోసం పుట్టిన మహా అవతారం `దత్తాత్రేయు అవతారం’. వారి అవతారిక పరమపవిత్రం. పరమానందం. అందుకే వారు ఆదిగురువులయ్యారు. జై గురుదేవదత్త.
– కణ్వస