అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకి పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో ఆశ్రయం కల్పించినట్లు భారత నిఘావర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అతను పాకిస్తాన్ లో ఉండటం లేదని, కానీ అతను తరచూ పాకిస్తాన్ వచ్చి పోతుంటాడని పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ మీడియా గ్రూప్ ‘డాన్’ సి.ఈ.ఓ. హమీద్ హరూన్ తెలిపారు. ముంబై ప్రెస్ క్లబ్, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈరోజు సాయంత్రం ముంబైలో ఒక చర్చా వేదికను ఏర్పాటు చేసాయి.
“భారత్-పాకిస్తాన్ ల మధ్య మెరుగుపడిన ద్వైపాక్షిక సంబంధాలను ఏవిధంగా బలోపేతం చేయాలనే విషయంపై చర్చించేందుకు ముంబైలో ఇవ్వాళ్ళ సాయంత్రం ఒక చర్చా కార్యక్రామాన్ని ఏర్పాటు చేసాయి. దానికి ఆహ్వానింపబడిన హమీద్ హరూన్ ఈ విషయం తెలియజేసారు. “నేను అతనిని ఎప్పుదోఒ చూడలేదు కానీ నాకు తెలిసినంతవరకు అతను పాకిస్తాన్ లో స్థిరనివాసం ఏర్పరచుకోలేదని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అతను దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య తిరుగుతుంటాడని విన్నాను. అతనొక హంతకుడు. హంతకులని ఏ ప్రభుత్వమూ కూడా ఉపేక్షించకూడదని నేను కోరుకొంటున్నాను. భారత్-పాక్ సంబంధాలు మెరుగుపడటానికి రెండు ప్రభుత్వాలు తగినంత కృషి చేయడం లేదని భావిస్తే ఇరు దేశాల ప్రజలే చొరవ తీసుకోవాలి. నిరుపేద మత్య్సకారులను దేశభద్రతకు ప్రమాదం అంటూ నిర్బందించడం సరికాదు. వారిని ఎప్పటికప్పుడు ఇరు దేశాలు విడుదల చేస్తుండటం చాల మంచి పద్ధతి,” అని హమీద్ హరూన్ అన్నారు.