నేడు క్రిస్మస్ పండుగ. ఎంతో పర్వదినం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చర్చిలలో క్రీస్తు ప్రార్ధనా గీతాలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం క్రీస్టియన్లు మాత్రమే చేసుకొనే పండుగ అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు అందరూ సుఖశాంతులతో అన్నదమ్ములవలె మెలగాలనే గొప్ప శాంతి సందేశం ఇచ్చిన దైవదూత జన్మించిన రోజు ఇది. సాటి మనుషులనే కాక ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణుల పట్ల కరుణ, దయ, మానవత్వం కలిగి ఉండాలని ఉద్భోధించిన మహనీయుడు జన్మించిన సుదినం నేడు. ఆయన చెప్పిన అంత గొప్ప విషయాలను ఆ కాలంలోనే అర్ధం చేసుకోలేని అజ్ఞానంతో ఆయనను శిలువ ఎక్కించి బలిగొన్నారు. కానీ అయన పలికిన ప్రతీ పలుకు నేటికీ ప్రజల హృదయంలో సజీవంగా నిలిచి ఉందంటే కారణం అవి నూటికి నూరుపాళ్ళు ఆచరించదగ్గవి కనుకనే.
అన్ని మతాల సారాంశం ఒక్కటే. శాంతి..ప్రేమ..దయ కలిగి ఉండటమే. వాటికి ఎవరు ఎన్ని బాష్యాలయినా చెప్పుకోవచ్చును. కానీ వాటి పరమార్ధం మాత్రం ఒక్కటే. ఈ ప్రపంచంలో మానవాళి అంతా సుఖశాంతులతో జీవింపజేయడమే వాటి పరమార్ధం. తనను బాదించినవాడిని కూడా ప్రేమించమని చెప్పిన మహనీయుడు ఏసు క్రీస్తు. “సాటి మనిషిని, ప్రాణిని ప్రేమించలేని వాడు, గౌరవించలేనివాడు ఎన్ని ప్రార్ధనలు చేసినా అవి వ్యర్ధం” అని ఆ మహనీయుడు చెప్పిన మాటని ఏ మతం కాదంటుంది. దానికి ఏ మతం ఉంది? అందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు.