పచ్చిమ గోదావరి జిల్లాలోని ఐ-భీమవరం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు నిర్మించిన వేదపాఠశాలను నేడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి ఉదయం సుమారు 11.00 గంటలకు గన్నవరం విమానాశ్రయం చేరుకొంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టరులో 11.35 గంటలకు ఐ-భీమవరం చేరుకొంటారు. వేదపాఠశాల ప్రారంభోత్సవం చేసిన తరువాత అక్కడ జరిగే కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.
ఆ తరువాత అక్కడ ఒక సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటన్నరకు తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా తిరుపతి వెళతారు. రేణిగుంట విమానశ్రయంలో గవర్నర్ నరసింహన్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు ఆయనకి స్వాగతం పలుకుతారు. అక్కడి నుండి ఆయన కారులో తిరుమల కొండమీద ఉన్న పద్మావతీ అతిధి గృహానికి చేరుకొని కొంత సేపు విశ్రాంతి తీసుకొన్న తరువాత వరాహనరసింహ స్వామి వారిని, ఆ తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొంటారు. సాయంత్రం 6.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి హైదరాబాద్ బయలుదేరుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా గన్నవరం, ఐ-భీమవరం, రేణిగుంట, తిరుమలలో కట్టుదిట్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు.