భారత్ లో అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి రష్యా సహకరిస్తోంది. రష్యా సహకారంతోనే తమిళనాడులోని కుదంకుళం వద్ద ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించబడింది. ప్రధాని నరేంద్ర మోడి రష్యా పర్యటన సందర్భంగా భారత్ లో మరో రెండు భారీ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణానికి ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వాటిలో ఒకటి ప్రకాశం జిల్లాలో కావలి వద్ద నిర్మించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కుదంకుళం వద్ద అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించినపుడే దాని ఐదు మరియు ఆరవ యూనిట్లను ఆంధ్రప్రదేశ్ లో నిర్మించాలని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అందుకు అంగీకరించింది.
ఇంతకు ముందు శ్రీకాకుళం జిల్లాలో కొవ్వాడ వద్ద అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించాలని ప్రభుత్వం భావించినపుడు స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఆ ఆలోచన విరమించుకొంది. కావలి వద్ద ఈ ప్లాంట్ నిర్మాణానికి అవసరమయిన ప్రభుత్వ భూములు ఉన్నందున అక్కడ స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావని ప్రభుత్వం భావిస్తోంది. కానీ అక్కడ కూడా స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురవుతోంది. సుమారు 2500 ఎకరాలలో ఈ అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.