ప్రముఖ తమిళ నటుడు శింబుకి ఊహించని కష్టాలు వచ్చి పడ్డాయి. ఆయన వ్రాసి పాడినట్లుగా చెప్పబడుతున్న ‘బీప్ సాంగ్’ ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఆ పాటలో మహిళలను అసభ్యంగా వర్ణిస్తూ పాడుతూ అసభ్యకరమయిన పదాలు వచ్చినప్పుడల్లా ‘బీప్’ శబ్దం పెట్టడంతో దానికి బీప్ సాంగ్ అని పేరు వచ్చింది. ఆయనపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయనపై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినట్లు తెలిసినప్పటి నుంచి శింభు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. పోలీసులు ఆయన కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ఆ పాటకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించినందుకు అతనిపై కూడా కేసులు నమోదు అయ్యేయి. ప్రస్తుతం తమిళనాడులో ఇదే హాట్ టాపిక్.
శింభు తల్లి ఉషా టి.రాజేందర్ ఆ పాటను తన కొడుకే ఎప్పుడో వ్రాసినట్లు అంగీకరిస్తున్నారు. అతని స్నేహితులెవరో ఆకతాయితనంతో ఆ పాటను ఇంటర్నెట్ లో పెట్టి ఉండవచ్చని ఆమె వాదిస్తున్నారు. తన కొడుకు చేయని తప్పుకి బలవుతున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. పోలీసులు, మీడియా కూడా అతనేదో ఉగ్రవాదో హంతకుడో అన్నట్లుగా వెంటపడుతున్నారని ఆమె కంట తడిపెట్టారు. వారి కారణంగా తమ జీవితాలు దుర్బరం అయ్యేయని, తాము చెన్నైలో ఉండలేని పరిస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. బాల నటుడుగా సినీ రంగానికి వచ్చిన తన కొడుకు శింభుని ఇంత కాలం ఆదరించిన తమిళనాడు ప్రజలే ఇప్పుడు తమను ఈవిధంగా అవమానిస్తున్నారని ఆమె బాధపడ్డారు. ఈ బాధలు భరించలేక రాష్ట్రం విడిచిపెట్టి ఎక్కడికయినా వెళ్లిపోదామని అనిపిస్తోందని ఆమె అన్నారు.
“నా కొడుకు ఏమీ హత్యలు, మానభంగాలు చేయలేదు. కానీ అతనిని ఉరి తీయాలని కొందరు డిమాండ్ చేయడం నన్ను చాలా కలచివేస్తోంది. ఇంతకీ నా కొడుకుని ఉరి తీయవలసినంత నేరం ఏమి చేసాడు? ఆకతాయితనంతో ఎప్పుడో ఒక పాట వ్రాశాడు. అది కూడా తప్పేనా? అది తప్పయితే అందుకు అతనిని కాదు. అతనిని కనిపెంచిన నన్ను ఉరి తీయండి ముందు. మేము ఎవరికీ మొర పెట్టుకొవాలో తెలియడం లేదు. నానాటికి మా పరిస్థితి అద్వానం మారుతోంది. శింభు ఎక్కడికి పారిపోలేదు. నేనే అతనిని పోలీసులకు అప్పగిస్తాను. ఇకనయినా మా కుటుంబంపై ఈ అకారణ ద్వేషాన్ని విడిచిపెట్టమని నేను చేతులు జోడించి అందరినీ ప్రార్ధిస్తున్నాను,” అని ఆమె కన్నీళ్ళతో వేడుకొన్నారు.
మహిళల గురించి చాలా మంది రాజకీయ నాయకులు చాలా చులకనగా మాట్లాడుతుంటారు. అప్పుడు నిరసనలు ఎదురయినపుడు వారు తమ వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, క్షమాపణలు చెప్పి ఆ సమస్య నుండి బయటపడుతుంటారు. కానీ మద్రాసు హైకోర్టు శింబు పెట్టుకొన్న ముందస్తు బెయిలు పిటిషన్ని తిరస్కరించగానే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆవిధంగా చేయకుండా ఆయన మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పుకొని ఉంటే పరిస్థితులు ఇంత తీవ్రం అయ్యి ఉండేవి కావేమో? ఒకవేళ ఆయన పోలీసులకి లొంగిపోయినా కోర్టులు ఆయనను అటువంటి పాట వ్రాసి పాడినందుకు ఉరితీయబోవనే సంగతి రహిస్తే పరిస్థితులు ఇంతవరకు వచ్చేవే కావు. కానీ శింభు,కమల్ హాసన్ వంటి ప్రముఖ నటులకి రాష్ట్రం విడిచిపెట్టిపోవలసినంత తీవ్ర పరిస్థితులు ఎదురవుతుండటం ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చును.