రష్యా నుండి ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ చేరుకొన్న భారత ప్రధాని నరేంద్ర మోడి అక్కడ ఆఫ్ఘనిస్తాన్ కోసం భారత్ నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రారంభోత్సవం చేసిన తరువాత డిల్లీ రావలసి ఉంది. కానీ ఆకస్మికంగా అయన పాకిస్తాన్ వెళ్లాలని నిశ్చయించుకొన్నారు. ఈరోజు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జన్మదినం కావడంతో, లాహోర్ వెళ్లి ఆయనని కలిసి శుభాకాంక్షలు తెలిపి అక్కడి నుండి డిల్లీ చేరుకోవాలని నిశ్చయించుకొన్నారు.
ఈ విషయాన్ని ఆయన ముందుగా తన సిబ్బందికి గానీ, భారత, పాక్ విదేశాంగ మంత్రులకు గానీ తెలియజేయలేదు. “డిల్లీ వెళ్ళేదారిలో లాహోర్ లో పాక్ ప్రధానిని కలవాలనుకొంటున్నాను” అని ట్వీట్ మెసేజ్ పెట్టగానే ఇరుదేశాల ప్రభుత్వాధికారులు అందుకు హడావుడిగా అవసరమయిన అన్ని ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. ఒక ప్రధానమంత్రి చెప్పాపెట్టకుండా ఈవిధంగా మరొక దేశానికి బయలుదేరడం ఇదే మొదటిసారి. తన జన్మదినం రోజున శుభాకాంక్షలు చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోడి రావాలనుకోవడం పాక్ ప్రధానికి చాలా సంతోషం కలిగించవచ్చును. పాక్ ప్రజలు కూడా తమ ప్రధానికి మోడీ అంత విలువ ఇస్తున్నందుకు చాలా సంతోషించవచ్చును. ప్రధాని నరేంద్ర మోడి లాహోర్ లో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో సమావేశమయిన తరువాత అక్కడి నుండి నేరుగా డిల్లీ చేరుకొంటారు.