ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి డిల్లీ వస్తునప్పుడు ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని కలిసిరావడాన్ని ఇరు దేశాలకు చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశాంగ నిపుణులు, ప్రజలు చాలా మంది స్వాగతిస్తున్నారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాల నేతలు మాత్రం విమర్శిస్తున్నారు.
జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్ సయీద్, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా: “ప్రధాని మోడీ సరయిన దిశలో ఒకడుగు వేశారు.”
మాజీ విదేశాంగ మంత్రి నట్వర్ సింగ్: “ఇది ఎవరూ ఊహించలేని మంచి ప్రయత్నం. దీని వలన ఇరుదేశాల ప్రజలకు మంచి సంకేతం పంపినట్లయింది” అని అన్నారు.
రక్షణరంగ నిపుణుడు ఖమర్ ఆఘ: “ప్రధాని లాహోర్ పర్యటన వలన పాక్ లో ప్రజాస్వామ్యం బలపడుతుంది. రెండు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది.”
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్: “ఇది చాలా మంచి నిర్ణయం.”
కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అజోయ్ కుమార్: “భారత్-పాక్ మధ్య సంబంధాలు అంత బలంగా లేనప్పుడు మోడీ పాక్ ఎందుకు వెళ్లినట్లో అర్ధంకావడం లేదు. ఇంత ముఖ్యమయిన సమాచారాన్ని ట్వీటర్ మెసేజుల ద్వారా మనం తెలుసుకోవలసిరావడం చాలా దురదృష్టకరం. ఈమధ్యనే పార్లమెంటు సమావేశాలు ముగిసాయి. ఆయన పాకిస్తాన్ వెళ్ళాలనుకొంటున్న విషయం పార్లమెంటుకి కూడా తెలియజేయాలనుకోలేదు.”
కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ: “ఇదొక గొప్ప సాహసం అని చెప్పవచ్చును. మోడీ చేసిన ఈ సాహసం దేశభద్రతకు సవాలుగా మారవచ్చును. తీరా చేసి ఆయన ఇంత సాహసం చేసినా రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఆశించలేము. అసలు అంత ఆకస్మికంగా లాహోర్ ఎందుకు వెళ్ళాలనుకొన్నారో అర్ధం కావడం లేదు.”
కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ: “ప్రధాని నరేంద్ర మోడి, పాక్ ప్రధాని షరీఫ్ నివాసం చేరుకొనేసరికి అక్కడ ఒక పాకిస్తాన్ కి చెందిన ఒక వ్యాపారవేత్త ఉన్నారు. అటువంటప్పుడు ఇది ఆకస్మిక పర్యటన ఎలా అయింది?”
జె.డి.యు (నితీష్ కుమార్): “ఒకవైపు సరిహద్దుల వద్ద నిత్యం కాల్పులు జరుగుతున్నప్పుడు, పాక్ సైనికులు ఇద్దరు భారత జవాన్ల తలలు నరికి తీసుకువెళ్లినప్పుడు, ప్రధాని మోడి ఆకస్మికంగా లాహోర్ వెళ్ళడం నిర్ఘాంతపరుస్తోంది.”
సి.పి.ఐ.: మోడీ నిర్ణయం సరయినదే. దాని వలన ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయి.”
సుష్మ స్వరాజ్: చాలా మంచి నిర్ణయం. ఇరుగుపోరుగులతో అటువంటి సంబంధాలే కలిగి ఉండాలి.”
వెంకయ్యనాయుడు: “అసలు కాంగ్రెస్ నేతలు ఏమి కోరుకొంటున్నారో వారికే తెలియదు. మా ప్రభుత్వం ఏమి చేసినా దానిని తప్పు పట్టడమే వారి పని.”
డిల్లీలో యువజన కాంగ్రెస్ నేతలు మోడీ లాహోర్ పర్యటనని నిరసిస్తూ మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.