మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెరాసకు ‘నల్గొండ బస్తీమే సవాల్’ విసిరారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్ధిగా నిలబడిన తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ఓడిపోయినట్లయితే తను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. అంతే కాదు తను శాస్వితంగా రాజకీయాల నుంచి కూడా తప్పుకొంటానని ప్రకటించేరు. “నా సవాలును ముఖ్యమంత్రి కేసీఆర్ స్వీకరించే దైర్యం ఉందా? ఒకవేళ తెరాస అభ్యర్ధి చిన్నప రెడ్డి ఓడిపోతే ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయగలరా?” అని ప్రశ్నించేరు. ఒకపక్క ఇతర పార్టీల అభ్యర్ధులను, వారి మద్దతుదారులను, పార్టీ నేతలను ఎరవేసి తెరాసలో చేర్చుకొంటూ పాపాలు చేస్తున్న కేసీఆర్, ఎన్ని యాగాలు చేసిన ఫలితం దక్కదని కోమటిరెడ్డి విమర్శించారు. ఏనాడూ తెలంగాణా ఉద్యమాలలో కనబడని చిన్నప రెడ్డిని తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి అవలీలగా ఓడిస్తారని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేసారు.
కోమటిరెడ్డి తన సోదరుడు విజయం సాధిస్తారని నమ్మకం వ్యక్తం చేయడం వరకు బాగానే ఉంది. ఒకవేళ ఆయన ఓడిపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకొంటానని ప్రకటించిన తరువాత, తెరాస అభ్యర్ధి ఓడిపోతే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేస్తారా? అంటూ చిన్న మెలిక పెట్టడంతో కోమటిరెడ్డి చేసిన సవాలుకి విలువ లేకుండా పోయింది. ఆ మెలిక పెట్టకుండా ఆయన సవాలు విసిరి ఉండి ఉంటే అది ఆయన ఆత్మవిశ్వాసానికి అద్దం పట్టేది.
అయినా అధికారంలో ఉన్నవాళ్ళను ప్రతిపక్ష నేతలు ఈవిధంగా రాజీనామా సవాళ్ళు చేయడం సర్వసాధారణమయిన విషయమే. కొన్ని రోజుల క్రితం వైకాపా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇటువంటి సవాలే విసిరారు. ప్రతిపక్షంలో ఉన్నారు కనుక వాళ్ళు తమ పదవులకు రాజీనామాలు చేసినంత మాత్రాన్నపోయేదేమీ ఉండదు. కానీ కష్టపడి ఎన్నికలలో గెలిచి మంత్రిపదవులు సంపాదించుకొన్న వారు ఇటువంటి సవాళ్ళను స్వీకరించి తమ పదవులను వదులుకొంటారనుకోవడం అవివేకమే.