నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ, అడవులు మరియు పర్యావరణ శాఖామంత్రిగా వ్యవహరిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలుష్యానికి నివారణోపాయం కనిపెట్టాడు. కనిపెట్టడమే ఆలశ్యం అమలుచేయడం పెట్టేసాడు కూడా. అదే వాహనాలకు బదులు ప్రజలు గుర్రాలను ఉపయోగిస్తే కాలుష్యం అరికట్టవచ్చని తెలియజేసేందుకు ఈరోజు మధ్యాహ్నం గుర్రం ఎక్కి పాట్నానగర వీదులలో కాసేపు విహారించేరు. గుర్రాల వలన ఎటువంటి శబ్ద, వాయు కాలుష్యం ఉండదు కనుక ప్రజలందరూ గుర్రాలు వాడితే బాగుంటుందని సూచించారు.
మంత్రిగారికి భద్రత దళాలు కూడా గుర్రాల మీదనే వెన్నంటి బయలుదేరవలసి వచ్చింది. కానీ మీడియా ప్రతినిధులు మాత్రం మోటార్ సైకిళ్ళపై ఆయన వెంటపడి ఫోటోలు తీసుకొన్నారు. అంటే మంత్రిగారి సందేశం ప్రజలకు చేర్చవలసిన బాధ్యత గల మీడియా వాళ్ళకే ఆయన సందేశం సరిగ్గా చేరనట్లు అర్ధమవుతోంది. కాలుష్యం తగ్గించాలంటే సైకిళ్ళు, ప్రజా రవాణా వ్యవస్థలను వాడమని అందరూ సూచిస్తుంటారు. కానీ మన లాలూ కొడుకు గారు మాత్రం గుర్రాలే బెస్ట్ అని చెపుతున్నారు.