మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటనతో మళ్ళీ చాలా కాలం తరువాత భారత్ పట్ల పాక్ వైఖరిలో సానుకూల మార్పు కనబడుతోంది. అందుకు మొదటి చిహ్నంగా జనవరి 15వ తేదీన ఇస్లామాబాద్ లో భారత్-పాక్ విదేశాంగ కార్యదర్శులు సమావేశం అయ్యేందుకు ఇరు దేశాలు సంసింద్దత వ్యక్తం చేసాయి. ఇటీవల భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ లో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్నప్పుడే ఇందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. నిన్న మోడీ పర్యటనతో అది దాదాపు ఖాయం అయ్యింది. సుమారు ఏడాదిన్నర కాలంగా దీనిపై ప్రతిష్టంభన ఏర్పడి ఉంది. మోడీ పర్యటన పట్ల దేశంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కానీ చైనా, అమెరికాతో సహా అనేక ప్రపంచ దేశాలు మోడీ లాహోర్ పర్యటనను చాలా హర్షిస్తున్నాయి. దాని వలన భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నాయి.