ఈనాడు మీడియా గ్రూప్ చైర్మన్ రామోజీరావు నిర్మించబోతున్న ‘ఓం సిటీ’ ఆధ్యాత్మిక నగరానికి 505 ఎకరాల భూమిని ఇవ్వడానికి తెలంగాణా ప్రభుత్వం లైన్ క్లియర్ చేసినట్లు తాజా సమాచారం. రెవెన్యూ అధికారులు అందుకు అవసరమయిన ప్రతిపాదనలు అన్ని సిద్దం చేసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదానికి పంపించినట్లు తెలుస్తోంది. ఓం సిటీ నిర్మించేందుకు రామోజీరావు 2,000 ఎకరాల భూమి కావాలని గత ఏడాది ఏప్రిల్ నెలలో తెలంగాణా ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకొన్నారు.
ఆ తరువాత రామోజీరావు ప్రధాని నరేంద్ర మోడిని కలిసి వచ్చేరు. అప్పటి నుండి రామోజీ పట్ల తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో అకస్మాత్తుగా మార్పు వచ్చింది. అంతవరకు ఆయనను, ఈనాడు మీడియాని ద్వేషిస్తున్న ఆయన స్వయంగా తన మంత్రులను వెంటబెట్టుకొని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి ఆయనని కలిసి వచ్చేరు. ఆ సందర్భంగా రామోజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి ‘ఓం సిటీ’ చిత్రాలు చూపించడం అప్పుడే దానికి అవసరమయిన భూమిని సమకూర్చేందుకు కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకారం తెలపడం జరిగిపోయాయి. కానీ ఒకే చోట 2000 ఎకరాలు లభించకపోవడంతో, ముందుగా హయత్ నగర్ మండలంలోని కోహెడ, అబ్దుల్లాపూర్ గ్రామాలలో 505 ఎకరాలను రామోజీకి అప్పగించేందుకు అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
అందులో ఆయన రూ.3,000 కోట్ల వ్యయంతో దేశంలో ఉన్న అన్ని ప్రధాన పుణ్యక్షేత్రాల నమూనాలను నిర్మించాలనుకొంటున్నారు. ఎప్పుడు తెల్లటి బట్టలు ధరించే రామోజీరావు సూటుబూటు వేసుకొని పనిగట్టుకొని డిల్లీ వెళ్లి తమ సంస్థలు చేపడుతున్న స్వచ్చా భారత్ కార్యక్రమాల గురించి, పనిలోపనిగా ఈ ‘ఓం సిటీ’ గురించి ప్రధాని నరేంద్ర మోడికి వివరించి వచ్చేరు. కనుక ఇక దానికి ఎవరి నుంచి అడ్డంకులు ఎదురవకపోవచ్చును.