హైదరాబాద్: మెదక్ జిల్లా ఎర్రవల్లిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఉదయం హాజరయ్యారు. విజయవాడనుంచి వస్తూ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, పట్టుచీర, ప్రసాదాన్ని తీసుకొచ్చారు. యాగస్థలి వద్ద బాబు బృందానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, ఇంద్ర కరణ్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కొప్పుల ఈశ్వర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ కూడా ఎదురు వెళ్ళి బాబును సాదరంగా ఆహ్వానం పలుకుతూ ఆలింగనం చేసుకున్నారు. యాగస్థలికి చేరుకున్న తర్వాత, యాగశాలలో కూర్చున్నవారందరూ ధరించినట్లే పసుపుపచ్చ వస్త్రాన్నిచంద్రబాబు పైన కప్పుకున్నారు. ఆయన వెంట కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి వెళ్ళి చండీమాతను దర్శించుకున్నారు. తర్వాత యాగక్రతువులో పాల్గొన్నారు. కేసీఆర్, రుత్విక్కులతో కలిసి యజ్ఞగుండంలో ఆవునెయ్యిని వదిలారు. తర్వాత కేసీఆర్ బాబును, వెంట వచ్చినవారిని సత్కరించారు. శాలువా కప్పి, కనకదుర్గమ్మ విగ్రహాన్ని, పళ్ళబుట్టను, కానుకలను బహూకరించారు.
మరోవైపు చంద్రబాబు వచ్చే సమయానికే యాగస్థలిలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. యజ్ఞగుండాలలో పొగ ఒక్కసారిగా కమ్ముకోవటంతో రుత్విక్కులు కొంతమంది యాగశాలనుంచి బయటకు వెళ్ళిపోయారు. వారిని ప్రధాన పండితులు మైకులో పదేపదే పిలవటం వినిపించింది. హరీష్ రావు కూడా జోక్యం చేసుకుని మైకులో సూచనలు ఇస్తూ పరస్థితిని చక్కదిద్దారు. ఇవాళ చండీయాగం చివరిరోజు కావటంతో భక్తులు భారీసంఖ్యలో వస్తున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రానున్నారు. కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు, అలనాటి సినీ నటి జమున కూడా ఈ ఉదయం హాజరయ్యారు. జమున కేసీఆర్కు కాళ్ళకు నమస్కరించటం కనిపించింది.