హైదరాబాద్: చెదురుమదురు ఘటనల మధ్య తెలంగాణలో ఇవాళ స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలోని 6 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 30న జరుగుతుంది. తొమ్మిది జిల్లాలలోని 12 స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు ఏకగ్రీవమయ్యాయి. రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలలో రెండేసి స్థానాలకు, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల పోలింగ్ కేంద్రం వద్ద, నల్గొండలో పోలింగ్ కేంద్రం వద్ద స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఫిర్యాదు మేరకు ఈసీ ఈ చర్య చేపట్టింది.