రాష్ట్ర విభజన జరిగి అప్పుడే ఎడాదిన్నర కాలం గడిచిపోయింది కానీ హైదరాబాద్ లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వానికి ఇంతవరకు ఎటువంటి ‘క్లారిటీ’ ఏర్పడినట్లు లేదు. ఉద్యోగులందరినీ విజయవాడకి తరలించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసారు. కానీ నేటికీ సాధ్యం కాలేదు. వారిని విజయవాడకు తరలిస్తే వారికి ఇళ్ళు, కార్యాలయాల కోసం రకరకాల ఆలోచనలు చేసారు. ఉద్యోగులకు ఇళ్ళు చూపించారో లేదో తెలియదు కానీ మంత్రులందరికీ ‘రెయిన్ ట్రీ పార్కు’ అపార్టుమెంటులలో విలాసవంతమయిన ఫ్లాట్స్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయంలో నేటికీ ప్రభుత్వం సందిగ్ధంలోనే ఉంది.
ఉద్యోగుల తరలింపు విషయంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతోంది అంటే అర్ధం చేసుకోవచ్చును. ఎందుకంటే అందుకు ఉద్యోగుల సహకారం కూడా అవసరం. కానీ ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు విషయంలో కూడా ఎందుకు ఇంత అయోమయానికి గురవుతోందో తెలియడం లేదు. కొన్ని నెలల క్రితం ఉద్యోగుల ఇళ్ళు, ప్రభుత్వ కార్యాలయాల కోసం అమరావతిలోనే తాత్కాలికంగా ఒక టౌన్ షిప్ నిర్మించాలనుకొంది. కానీ దానికి సుమారు రూ.350-500 కోట్లు వరకు ఖర్చు అవుతుందని ఆ ప్రతిపాదనను విరమించుకొంది. ఆ తరువాత తుళ్ళూరులో తాత్కాలిక శాసనసభ భవనం నిర్మించాలనుకొన్నారు. మళ్ళీ ఖర్చుకి భయపడి ఆ ప్రతిపాదనను కూడా విరమించుకొంది.
మళ్ళీ ఇప్పుడు తాత్కాలిక సచివాలయ భవనం నిర్మించాలని నిర్ణయించుకొంది. త్వరలో అందుకు టెండర్లు కూడా పిలవాలని నిశ్చయించుకొంది. ఆరు లక్షల అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణం అంటే కనీసం రూ. 75-100 కోట్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇదివరకు ప్రకటించినట్లు అమరావతి నిర్మాణ పనులు జూన్ 2016 నుండి ప్రారంభించేమాటయితే, ముందుగా శాశ్విత సచివాలయ భవనమే నిర్మించుకోవచ్చును కదా? కానీ అలాగ చేయకుండా ఇప్పుడు కోట్లు ఖర్చు పెట్టి తాత్కాలిక సచివాలయ భవనం ఎందుకు నిర్మిస్తున్నట్లు? అంటే దానర్ధం ఇపుడప్పుడే రాజధాని నిర్మాణ కార్యక్రమాలు జరిగే అవకాశం లేదనుకోవాలా? తెదేపా కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడానికే తాత్కాలిక సచివాలయం నిర్మిస్తోందని ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తే దానికి ప్రభుత్వం ఏమని జవాబు చెపుతుంది? ఇప్పుడు కోట్లు ఖర్చు చేసి తాత్కాలిక సచివాలయ భవనాన్ని నిర్మించుకొంటే, శాశ్విత భవనం సిద్దమయ్యేక ఈ తాత్కాలిక భవనాన్ని ప్రభుత్వం ఏమి చేయాలనుకొంటోంది? ఆ భవనం మాస్టర్ ప్లాన్ లో ఇమడదు కనుక కోట్లు ఖర్చు పెట్టి కట్టబోయే ఈ భవనాన్ని తరువాత కూల్చివేస్తారా? తీరా చేసి సచివాలయం నిర్మించిన తరువాత ఒకవేళ ఉద్యోగులు తమకు సరయిన వసతి సౌకర్యం లేని కారణంగా విజయవాడ వచ్చేందుకు అంగీకరించకపోతే అప్పుడు ప్రభుత్వం ఏమి చేయాలనుకొంటోంది? ఇటువంటి అనేక సందేహాలు తలెత్తుతాయి. కనుక ప్రభుత్వం ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది. లేకుంటే విమర్శలు మూటగట్టుకోవలసి ఉంటుంది.