తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగం ఈరోజుతో పూర్తవుతుంది. ఇంతవరకు ఎటువంటి అపశ్రుతులు లేకుండా అంతా సవ్యంగా సాగిపోయింది. కానీ చివరి రోజయిన ఈరోజున యాగశాలలో అగ్ని ప్రమాదం జరిగింది. యాగం విరామ సమయంలో హోమ గుండంలో ఎవరో ఒకేసారి చాలా నెయ్యి పోయడంతో అగ్ని జ్వాలలు ప్రజ్వలించి పైన గడ్డితో నిర్మించిన కప్పుకు అంటుకొని మంటలు వ్యాపించాయి. తక్షణమే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరికొని మంటలను ఆర్పివేశాయి. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెలికాఫ్టర్ లో అక్కడికి చేరుకొన్నారు. కానీ క్రిందన ఉన్న సెక్యూరిటీ సిబ్బంది సలహా మేరకు ఆయన క్రిందకు దిగకుండానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. మళ్ళీ కొద్ది సేపు తరువాత యాగం యధావిధిగా ఆరంభించారు. ఈరోజు సాయంత్రం యాగం పూర్తవుతుంది.