హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనీ వినీ ఎరగని స్థాయిలో చేసిన అయుత చండీ మహాయాగం ముగిసింది. చివరిఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమం కొద్దిసేపటిక్రితం పూర్తయింది. స్వామీజీలు, రుత్విక్కుల వేదమంత్రోఛ్ఛారణలమధ్య దుర్గా చక్రం, మహంకాళి, మహా సరస్వతి, మహాలక్ష్మి సన్నిధి మధ్యనున్న కుండంలో పూర్ణాహుతి సమర్పించారు. పూర్ణఫలాలు, పుష్పాలు, నవధాన్యాలు, సమిధలు, పట్టువస్త్రాలు, కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలతో పూర్ణాహుతి చేశారు. ఈ క్రతువుకు జగద్గురు శృంగేరి పీఠాధిపతి హోమద్రవ్యాలు, వస్త్రాలు పంపించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ దంపతులతో పాటు గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా పాల్గొన్నారు. ఆ క్రతువు ముగిసిన తర్వాత వేదపండితులు గవర్నర్, సీఎమ్ దంపతులకు ఆశీర్వచనాలు చేశారు. కేసీఆర్ గవర్నర్‌ను అమ్మవారి ప్రతిమతో, కానుకలతో సత్కరించారు. మరోవైపు చివరి రోజు కావటంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. యాగశాల చుట్టూ ప్రదక్షిణలు చేసి తరించారు. కేసీఆర్ దంపతులు ఇవాళ ఇక్కడే నిద్రచేసి రేపు ఉదయం వేములవాడ వెళ్ళి రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు.