నారా లోకేష్ కి క్రమంగా పార్టీలో ప్రాధాన్యత పెంచే ప్రయత్నంలో పార్టీ జాతీయ కార్యదర్శిగా నియమించారు. అందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలేరు. కానీ ఆయన ప్రజా ప్రతినిధి కానందున నేరుగా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకోలేరు. కానీ తన అనుచరుడయిన అభీష్టని ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించుకొని ఆయన ద్వారా ప్రభుత్వ వ్యవహారాలలో జోక్యం చేసుకొంటున్నారని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వానికి సంబంధించిన అనేక ముఖ్యమయిన ఫైళ్ళను అభీష్ట తన వద్దకు రప్పించుకొని పరిశీలిస్తూ లోకేష్ తరపున అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారని రఘువీరా రెడ్డి ఆరోపించారు. తద్వారా నారా లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభీష్టపై ఆగ్రహం వ్యక్తం చేసారు.
అప్పుడు అభీష్ట తక్షణమే తన పదవికి రాజీనామా చేసి నాటి నుండి ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్ళడం లేదని తెలుస్తోంది. కానీ అతని రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదని, ఇప్పుడు ఆయన తెదేపా కార్యాలయం నుండే ఆ పనులను చక్కబెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కనుక ఇంతకీ ఆయన రాజీనామా చేసారా లేదా? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి ప్రశ్నలకు నారా లోకేష్ సంజాయిషీలు చెప్పుకోవడం కంటే ఆయన కూడా ఎన్నికల్లో పోటీ చేసి నేరుగా ప్రభుత్వం ఏదో ఒక పదవి చేపట్టవచ్చును కదా?అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.