హైదరాబాద్: మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ ఇవాళ హైదరాబాద్‌లో టీ హబ్‌ను సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్ సత్యకు స్వాగతం పలికారు. స్టార్టప్ కంపెనీలకోసం ఏర్పాటు చేసిన టీ హబ్ విశిష్టత, దానిలోని సౌకర్యాలను కేటీఆర్ సత్యకు వివరించారు. అనంతరం కేటీఆర్, ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సత్య భేటీ అయ్యారు. కొత్త ఐడియాలతో ముందుకొస్తే తప్పకుండా తోడ్పాటు అందిస్తామని సత్య స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో అన్నారు. ఐటీలో భారతీయుల నైపుణ్యాలు క్రమంగా పెరుగుతున్నాయని చెప్పారు. భారతీయులు త్వరలో ఐటీలో ఆధిపత్యం వహించే స్థాయికి చేరుకుంటారన్నారు. భారత్‌లో యాక్సిలేటర్లు, స్టార్టప్‌ల అభివృద్ధిలో భాగస్వాములమవుతామని చెప్పారు. టీ హబ్‌తో కలిసి పనిచేస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సత్య చెప్పారు.ఈ సందర్భంగా కేటీఆర్‌పై సత్య ప్రశంశలు కురిపించారు.