ప్రధాని మోడీ లాహోర్ పర్యటనను ఒక్క కాంగ్రెస్ పార్టీ తప్ప దాదాపు అన్ని రాజకీయపార్టీలు స్వాగతిస్తున్నాయి. ఇరుదేశాలలో ప్రజలు, ప్రపంచ దేశాలు కూడా స్వాగతిస్తున్నాయి. అది చూసి బీజేపీ నేతలు అందరూ మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటనను ఒక మహాద్భుతంగా వర్ణిస్తున్నారు. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అయితే మరో అడుగు ముందుకు వేసి “భవిష్యత్తులో భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు మళ్ళీ ఏకం అయిపోతాయని” జోస్యం చెప్పారు. కేంద్రంలో ఎలాగూ తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక బీజేపీ నేతలని చూసి ఎన్డీయే మిత్రపక్షాలు కూడా మోడీ లాహోర్ ఆకస్మిక పర్యటన గురించి చాలా గొప్పగా వర్ణిస్తున్నాయి.
అయితే మోడీ నిజంగానే ఆకస్మికంగా లాహోర్ పర్యటించారా? లేక ముందుగానే అనుకొనే వెళ్ళారా? అని ఆలోచిస్తే అదేమీ ఆకస్మిక పర్యటన కాదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి మోడీ బహుకరించిన గులాబీ రంగు తలపాగా తెలియజేస్తోంది. ఆయన కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఆ తలపాగాను షరీఫ్ తన మనుమరాలి వివాహ వేడుకల్లో ధరించారు. అందరూ అనుకొంటున్నట్లుగా ఒకవేళ ప్రధాని నరేంద్ర మోడి కాబూల్ నుంచి ఆకస్మికంగా లాహోర్ వెళ్ళినట్లయితే పాక్ ప్రధాని తన మనుమరాలి పెళ్లిలో ధరించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ తలపాగా ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్నించుకొంటే మోడీ లాహోర్ వెళ్ళాలని చాలా రోజుల క్రితమే నిశ్చయించుకొన్నట్లు స్పష్టం అవుతోంది.
అయితే అదొక ఆకస్మిక పర్యటనగా మోడీ ప్రభుత్వం ఎందుకు చిత్రీకరించిందంటే బహుశః దాని వలన వచ్చే ప్రచారం కోసమే అయ్యుండవచ్చును. ఊహించినట్లే ఇరు దేశాల ప్రజలు, ప్రపంచ దేశాలు అందరూ ఆయనను ఆకాశానికి ఎత్తేస్తున్నారిపుడు. మోడీ ప్రయోగించిన ఈ చిట్కాని అందరి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీయే కనిపెట్టి బయటపెట్టిందని చెప్పవచ్చును. మోడీ ఆకస్మికంగాగా లాహోర్ వెళ్ళినట్లయితే నవాజ్ షరీఫ్ ఇంట్లో జరిగిన వారిరువురి సమావేశంలో పాక్ పారిశ్రామిక వేత్తలు ఎందుకు ఉన్నారు? అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రశ్నించారు.
మోడీ ఆకస్మికంగా వెళ్ళినా ముందే అనుకొనే పాకిస్తాన్ వెళ్ళినా అదేమీ తప్పు కాదు. నేరం అంతకంటే కాదు. ఆయన పర్యటన వలన ఆయనకు పేరు మారుమ్రోగిపోవడం మాట ఎలాగున్నా దాని వలన ఇరు దేశాలమధ్య కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. అయితే అంత మాత్రాన్న ఇరు దేశాల మధ్య సమస్యలన్నీ రాత్రికి రాత్రే పరిష్కారం అయిపోతాయని భ్రమ పడనవసరం లేదని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కి విదేశీ వ్యహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ స్వయంగా నిన్న ప్రకటించారు.
భారత ప్రజలు కూడా మోడీ పర్యటనను స్వాగతిస్తున్నప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడి చేసిన ఒకే ఒక పర్యటనతోనే భారత్ పట్ల పాక్ వైఖరిలో మార్పు వచ్చేస్తుందని ఎవరూ అత్యాశపడటం లేదు. అదే సాధ్యమయి ఉండి ఉంటే ఇదివరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పాక్ పర్యటించినపుడే పాక్ వైఖరిలో మార్పు కనిపించి ఉండేది కానీ వాజ్ పేయి భారత్ చేరుకొన్న కొన్ని రోజులకే భారత్-పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. కానీ మళ్ళీ ఇప్పుడు అటువంటి మరో యుద్ధం జరుగుతుందని ఎవరూ భావించనప్పటికీ, మోడీ పర్యటన వలన పాక్ వైఖరిలో ఎంతో కొంత సానుకూల మార్పు కలుగుతుందని మాత్రం ఆశిస్తున్నారు. అందుకే ఈ పర్యటన వెనుక మోడీ ఆలోచన ఏదయినప్పటికీ స్వాగతించడమే మంచిది.