హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని ఉప్పల్‌లో ఇవాళ జరిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ కార్యక్రమం రసాభాసగా మారింది. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ వర్గానికి, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. దానం నాగేందర్‌పై కోడిగుడ్లు విసిరారు. కోడిగుడ్లు, టమోటాలతో పరస్పరం దాడులు చేసుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దానం నాగేందర్‌పై మల్లేష్ గౌడ్ అనుచరులు చేయిచేసుకున్నారు. దానం, అతని అనుచరులను మల్లేష్ గౌడ్ వర్గీయులు తరిమికొట్టారు. దానం హైదరాబాద్‌కే పరిమితమని, రంగారెడ్డి జిల్లా కార్యక్రమాలలో పాల్గొనగూడదనని మల్లేష్ గౌడ్ వర్గం నినాదాలు చేశారు. మొదట మల్లేష్ గౌడ్ జెండా ఎగరేయగా, దానం నాగేందర్ వచ్చి ఆ జెండాను దించి మళ్ళీ ఎగరేశారని దీనిపై మల్లేష్ గౌడ్ అనుచరులు తీవ్రంగా ఆగ్రహానికి గురైనట్లు చెబుతున్నారు. ఈ సంఘటనపై మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులందరినీ పార్టీ జెండాలను ఎగరేయాలని సూచించిందని, ఆ మేరకు తాను ఉప్పల్‌లో జెండా ఎగరేసి వచ్చేశామని, ఆ తర్వాత దానం నాగేందర్ అక్కడకు వెళ్ళి తాము ఎగరేసిన జెండాను దించి తాను తిరిగి ఎగరేశారని, దీంతో తమ వాళ్ళు కొందరు ఆగ్రహానికి గురయ్యారని చెప్పారు.