తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ఎదుగుతున్న ముగ్గురు వారసులూ దేశ జనాభాలో 65 శాతం మంది జనాభాకి ప్రాతినిధ్యం వహించే ఏజ్ గ్రూప్ లో వారే! ముగ్గురికీ విదేశాల్లో నేర్చుకుని వచ్చిన విద్య, విజ్ఞానాలు వున్నాయి. బలమైన రాజకీయ పునాదులు వున్నాయి. తిరుగులేని ఆర్ధిక సౌష్టవం వుంది. అయితే ఏ ఒక్కరూ వివాదాలకు అతీతంగా లేరు.వారి భవిష్యత్తు ఎలావుంటుందో గానీ, ఇప్పటికే వీరి ప్రభావం ప్రజల్లో గట్టిగానే వుంది
వీరిలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కెటిఆర్ (కల్వకుంట్ల తారక రామారావు) ప్రయాణమే మిగిలిన ఇద్దరికంటే కాస్త బాగున్నట్టు వుంది. ప్రజల్లో బలం వున్నా దాన్ని పటిష్టం చేసుకోలేకపోవడం వైఎస్ కుమారుడు జగన్ సమస్య…పార్టీ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్ళకపోవడం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ లోపం…
చంద్రబాబు ఏదారిలో ఉన్నత స్ధానాకికి వచ్చారో లోకేష్ నికూడా అదే బాట పట్టించారు. బాబు చాలా ఓర్పు వున్న ఆర్గనైజర్. ఎన్ టి ఆర్ ఆవేశ, ఉద్వేగాల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీని ఉద్యమ స్వభావాన్ని కేడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుదే! దేశంలో మరేపార్టీకీ లేనంత హెచ్చుగా తెలుగుదేశానికే 50 లక్షల మంది సభ్యులు వున్నారు. వ్యవస్ధాగతంగా అతి పెద్ద నిర్మాణం వున్న పార్టీ బాగోగులను చూసుకునే బాధ్యతలను విదేశాల్లో చదువు ముగించుకు వచ్చిన కొడుకు లోకేష్ కు చంద్రబాబు అప్పగించారు. అధికారంలో వున్న ప్రయోజనాలను కార్యకర్తలకు పంచకపోతే పార్టీకోసం పనిచేసే వారు వుండరు.
ఎదుగుతున్న నాయకుడు ప్రజల్లోకి వెళ్ళే ఏ అవకాశాన్నీ వొదులుకోరు. లోకేష్ ఏ అవకాశాన్నీ వినియోగించుకోరు. కార్యకర్తల్లో కూడా హైప్రొఫైల్ వారికే ఆయన దర్శనం దొరుకుతుందన్న విమర్శకూడా వుంది. ఒక విధంగా పైరవీకారులకు వున్నంత అందుబాటులో పార్టీకి లేరంటే అతిశయోక్తి అనిపించినా అదే నిజం! ఎన్ టి ఆర్ ట్రస్ట్ ఇన్ చార్జ్ గా, తెలుగుదేశం జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు చూస్తున్న లోకేష్ ప్రభుత్వంలో అన్ని కీలకమైన విషయాలలో జోక్యం చేసుకుంటున్నారు. తన మిత్రుడైన అభీష్ట ను ముఖ్యమంత్రి కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గా నియమింపజేసి ఆయన ద్వారా ఫైళ్ళు రప్పించుకుంటూ లోకేష్ చక్రం తిప్పుతున్నరని తెలుగుదేశం నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ విధంగా లోకేష్ రాజకీయ రంగ ప్రవేశం ”రాజ్యాంగేతర శక్తి” అనే లేబుల్ తో జరిగింది. బాధ్యతలు లేకుండా అధికారాలు చెలాయించడం నాయకులకూ ప్రజలకూ మంచిది కాదు. పరిస్ధితి తిరగబడితే జైలుకి పంపించగల తీవ్రత కూడా ఇందులో వుంది. అందుకు జగన్ పెద్ద ఉదాహరణ.
ఆరోగ్యశ్రీ వంటి పధకాల ద్వారా పరిపాలనకు మానవీయ కోణాన్ని జోడించిన వైఎస్ మీద పేదవర్గాల్లో ఇప్పటికీ ఒక ఆరాధనా భావన వుంది. ముఖ్యమంత్రి పదవికి కూడా జగన్ వారసుడని ఆయన తండ్రి అంత్యక్రియలు పూర్తికాకముందే మొదలైన సంతకాల ఉద్యమం ద్వారా జగన్ రాజకీయ ప్రవేశం గౌరవప్రదంగా జరగలేదు. ఎవరిమాటా వినని జగన్ పెంకితనం, మొండితనాల వల్ల, సామాన్య ప్రజల్లో పలుకుబడి వుండికూడా సహచరులు, అనుచరులు నిర్లిప్తంగా వుండిపోతున్నారు. పార్టీకి దూరమౌతున్నారు. వ్యూహం, ఎత్తుగడా లేని ఈ ధోరణిని పూర్తిగా వాడేసుకుంటున్న తెలుగుదేశం శాసనసభా సమావేశాల్లో ప్రతీ సారీ జగన్ ను నవ్వుల పాలు చేసి ప్రజలముందు చులకన పలచన చేస్తోంది. జగన్ వ్యవహార శైలి మారకపోతే పార్టీ నిలబడటం కష్టమని సీనియర్ నాయకులు గుసగుసలుపోతున్నారు.
కుటుంబపాలన అనే విమర్శ వస్తుందని తెలిసి కూడా తెలంగాణా ముఖ్యమంత్రి తనకుమారుడు కెటిఆర్ ను ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ మంత్రిగా నియమించారు. ప్రభుత్వంతో పనులు వున్నవారూ, ఆర్ధిక ప్రయోజనాలు వున్నవారూ, పైరవీకారులూ ఎపిలో లోకేష్ చట్టూ తిరుగుతున్నట్టే తెలంగాణాలో కెటిఆర్ చుట్టూ తిరుగుతారు. ఈ ప్రదక్షిణల చుట్టూ అవినీతి కూడా చుట్టూ తిరుగుతూనె వుంది. అయితే మంత్రి పదవిలో వున్న కెటిఆర్ ను రాజ్యాంగేతర శక్తి అని శత్రువులు కూడా అనలేరు. ఉద్యమ స్వరూపమే మాత్రమే వున్న టి ఆర్ ఎస్ పార్టీని వ్యవస్ధాగతంగా నిర్మించడానికి కెటిఆర్ కు మంత్రి పదవి ఒక కవచంలా కూడా వుంటుంది.
ఏది ఏమైనా వారసుల్లో జగన్ తనను తానే మార్చుకోవలసిన స్ధితిలో, లోకేష్ బాధ్యతలు లేని అధికారాలు చెలాయిస్తున్న ప్రమాదకరమైన పాత్రలో, కెటిఆర్ మంచికీ, చెడుకీ బాధ్యత తానే బాధ్యత వహించవలసిన తక్కువ రిస్క్ తో వున్నారు