హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం విషయంలో గందరగోళానికి రాష్ట్రప్రభుత్వం తెరదించింది. సచివాలయాన్ని గన్నవరం వద్ద ఉన్న మేధా టవర్స్‌లో ఏర్పాటు కానున్నట్లు, తుళ్ళూరు ప్రాంతంలో నిర్మాణం జరుగుతుందని వార్తలు వచ్చినప్పటికీ చివరకు తాత్కాలిక పరిపాలనా కేంద్రంగా మంగళగిరి ఖరారయింది. మంగళగిరిలో సీఆర్డీఏకు చెందిన అమరావతి టౌన్‌షిప్‌లోని ఖాళీస్థలాల్లో సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాత్కాలిక సచివాలయం ఏర్పాటుపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
అమరావతి టౌన్షిప్లో రెండంతస్తుల ఫ్యాబ్రికేటెడ్ సచివాలయ నిర్మాణ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 6,00,000 చదరపు గజాల విస్తీర్ణంలో దీనిని నిర్మించనున్నారు. నాలుగైదు నెలల క్రితమే తాత్కాలిక రాజధాని కార్యాలయాల ఏర్పాటుకోసం ప్రభుత్వ వర్గాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో విస్తృతంగా గాలించాయి. అప్పట్లోనే అమరావతి టౌన్షిప్ ప్రాంగణం తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలమైనదిగా గుర్తించారు. తర్వాత ఏమయిందో, ఏమో గానీ విజయవాడ సమీపంలోని మేధా టవర్స్‌ను ఎంపిక చేశారు. అయితే మేధా టవర్స్‌లో కార్యాలయాల ఏర్పాటుకు సాంకేతికమైన ఇబ్బందులు ఉన్నాయని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవల ప్రకటించారు. దీంతో అమరావతి టౌన్షిప్ మళ్ళీ తెరపైకి వచ్చింది. 400 ఎకరాల విస్తీర్ణంగల అమరావతి టౌన్షిప్లో ప్రస్తుతం వంద నుంచి 110 ఎకరాల వరకు ఖాళీగా ఉంది. నాగార్జున విశ్వవిద్యాలయానికి ఇది 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.