హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారంలో నిందితులను రక్షిస్తోందంటూ మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నిందితులను కాపాడటంలో మునిగిపోయారంటూ బహిరంగలేఖలో మండిపడ్డారు. వడ్డీల పేరుతో వేధించి మహిళలను బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపిన టీడీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కాపాడటానికి చంద్రబాబు నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంలో దోషులకు శిక్షపడేవరకు పోరాడాలని ప్రజలు, రాజకీయపార్టీలు, మహిళా సంఘాలకు పిలుపునిచ్చారు. దోషులకు శిక్ష పడకపోతే వారిని ప్రజాకోర్టులో హతమారుస్తామని హెచ్చరించారు. వేతనాల పెంపుకోసం చలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్ వాడీ మహిళలను ఉద్యోగాలనుంచి తొలగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద డ్రామాగా మావోయిస్టులు అభివర్ణించారు. కాల్‌మనీపై ప్రజలను, రాజకీయపార్టీలను పక్కదారి పట్టించేందుకు ఇదంతా చేశారని ఆరోపించారు.