ఫోకస్
తెలంగాణ సీఎం కేసీఆర్ అయుత చండీయాగం పూర్తి చేయడంతో ఇప్పుడు చాలా మంది మనసుల్లో ఒకేఒక్క ప్రశ్న తలెత్తింది. కేసీఆర్ చండీయాగంతో ఎలాంటి ఫలాలు (ఫలితాలు) సిద్ధించబోతున్నాయి? ఆ ఫలితాలను ఎప్పుడు చూడబోతున్నాం?
`విశిష్ట ఫలితాల సంగతి అటుంచితే, వెనువెంటనే గోచరించే ఫలితాలు ఏమైనా ఉన్నాయా ? ఉంటే, ఒకటి రెండు చెప్పండి సారూ…’ అంటూ ఉండబట్టలేక అడిగినవారూ ఉన్నారు. యాగం పూర్తికాగానే వెంటనే వర్షాలు పడతాయనీ, నదులు, సరస్సులు జలకళతో మెరసిపోతాయని చాలామంది అనుకుంటారు. ఇలా అనుకోవడం తప్పేమీకాదు. లోక కల్యాణం కోరుకునేవారెవరైనా అలాగే అనుకుంటారు. ఇదే మాట కేసీఆర్ కూడా అంటున్నారు. తెలంగాణ సస్యశ్యామలం కావాలనీ, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలన్న తపనతోనే తాను అయుత చండీయాగం చేశానని చెప్పారు. చండీయాగాలు చేయడం ఆయనకు కొత్తేమీకాదు. గతంలో కూడా తెలంగాణ సిద్ధించడం కోసం యాగం చేశారు. ఆ యాగ ఫలంగానే రాష్ట్ర అవతరణ జరిగిందని ఆయన ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఆ కోరిక నెరవేరింది. ఇక ఇప్పుడు అయుత చండీయాగం ప్రారంభానికి ముందే ఆయనో సంకల్పం చెప్పుకున్నారు. తన రాష్ట్రం, తన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనీ, అలాగే నీటిపారుదల ప్రాజెక్టులు నిర్విఘ్నంగా పూర్తికావాలనుకున్నారు. చండీమాతను అలాగే కోరుకున్నారట. తాను అనుకున్నట్లుగానే లోకహితమైన పనుల పూర్తవుతున్నాయనీ, అమ్మదయ తనపై అపారంగా ఉన్నదని ఆయన పూర్తిగా నమ్ముతున్నారు. అదే నిజమైతే, రాష్ట్ర ప్రజలు అనేకానేక సమస్యల నుంచి త్వరలోనే బయటపడాలి. కేసీఆర్ సంకల్పమే సిద్ధిస్తే, నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తవ్వాలి. ప్రజల కష్టాలు తీరాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పరమ చండీ భక్తుడైన కేసీఆర్ కోరికల మాట సరే, మరి సామాన్య ప్రజల కోరికలేమిటి? అవి ఎలా ఉన్నాయి ? వారి కోరికల జాబితా ఏమిటో కూడా తెలుసుకోవాలి.
సామాన్యులు కోరుకునేవి…
తెలంగాణానే కాదు, ఏ రాష్ట్ర సామాన్య ప్రజానీకానికైనా తీరని కోరికలు కొన్ని ఉన్నాయి. (స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు అయినా పాపం వీరి కోరికలను ఏ దేవుడూ తీర్చనే లేదు) . సామాన్యుల చిరకాల కోరికలు ఇవి…
– అవినీతి లేని పాలన.
– నిస్వార్థ రాజకీయాలు
– నిరుపేదలకు కూడు, గూడు, గుడ్డ
– కల్తీలేని ఆహారపదార్ధాలు అందేలా చూడటం
– ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు
– అందరికీ నాణ్యమైన విద్య
– గుంతలు లేని రహదారులు
– సమాజంలో అసమానతలు తొలిగిపోవడం
– పర్యావరణ పరిరక్షణ. చెరువులు, కుంటలు, కొండల్ని రియల్టర్స్ కి అప్పగించకుండా చూడటం.
ఇలాంటి అనేక కోరికలు ఉన్నాయి. అయితే, ఇవన్నీ ఒక్కసారే తీరాలని సామాన్యులు సైతం అనుకోవడంలేదు. ఒకటొకటిగా తీరితే సీఎం చేస్తున్న యాగాల ఫలాలు తమకుసైతం అందాయని వారు భావిస్తారు. పండుగ చేసుకుంటారు. కేసీఆర్ నే దేవుడిగా భావిస్తూ పూజలు చేస్తారు. అప్పుడే కేసీఆర్ అంటున్న `లోకకల్యాణం’ అన్న మాటకు సార్థకత దక్కుతుంది.
అయుత చండీయాగం తర్వాత ప్రయుత చండీయాగం కూడా చేస్తామని కేసీఆర్ అంటున్నారు. సత్సంకల్పంతో ఎలాంటి క్రతువు చేసినా ఎవ్వరూ తప్పుపట్టరు. శృంగేరి పీఠాధిపతి అనుమతిస్తే ప్రయుత యాగంకూడా చేస్తారు. యాగాలు చేయడంలో కేసీఆర్ కు అపారమైన అనుభవం ఉంది. ఎప్పుడు ఎలాంటి యాగం చేయాలో ఆయనకు బాగా తెలుసు. చండీయాగం వల్ల త్వరగా ఫలితం వస్తుందని గురువులు చెప్పడంతో ఆయన చండీయాగాల బాట తొక్కారు.
చండీయాగ ఫలాలు …
– నవ చండీ యాగం చేస్తే `వాజపేయం’ చేసినంత ఫలం. మహోన్నతమైన మానవ జీవనానికి పూర్వీకులు నిర్దేశించిన 48 సంస్కారాలలో ఒకటి `వాజపేయం’. ఇది సప్త సోమయాగాలలో ఒకటిగా చెబుతారు. ఈ ఏడింటిలోనే `అతిరాత్రం’ కూడా ఉండటం గమనార్హం.
– ఏకాదశ చండి చేస్తే రాజు వశమవుతాడు. (ఇప్పుడు రాజులు లేరుకనుక, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లేదా కేంద్రంలో ప్రధానమంత్రి వంటి వారు కావచ్చు)
– ద్వాదశ చండితో శత్రు నాశనం తప్పదు.
– మను చండి (చతుర్దశ చండి)తో ఎంతటి శత్రువైనా తన దారికి వస్తాడు.
– శత చండీ యాగం వల్ల కష్టాలు తొలిగిపోతాయి. అనారోగ్యం మటుమాయమవుతుంది. ధన నష్టం తగ్గిపోతుంది.
– సహస్ర చండీతో లక్ష్మీదేవి కరుణిస్తుంది. కోరిన కోరికలు తీరతాయి.
– లక్ష చండీ చేస్తే చక్రవర్తి అవుతారు. (ఇప్పుడు కేసీఆర్ చేస్తామంటున్న ప్రయుత చండీయాగం దీనికంటే ఘనమైనది. మరి దీని ఫలితం ఎలా ఉంటుందన్నది నిర్దుష్టంగా తెలియలేదు)
మార్కండేయ పురాణం ఇలాంటి ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు అయుత చండీ యాగం జరిగిన తెలంగాణలోనే కొన్ని దశాబ్దాల కిందట లక్ష చండీ యాగం జరిగిందని చెబుతున్నారు. మహారాష్ట్రకు చెందిన ఉపేంద్ర మహరాజ్ నిజాం పాలన కాలంలో హైదరాబాద్ పాతబస్తీలో లక్ష చండీ యాగం చేశారట. అప్పట్లో లోక కల్యాణం కోసమే ఆయన దానిని తలపెట్టారనీ, ఆ తర్వాతే నిజాం ప్రభుత్వాన్ని భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని అంటున్నారు. యాగానంతరం `తెలంగాణ’ స్వేచ్ఛా గాలులు పీల్చుకుంది.
మరుమాముల వెంకట రమణ శర్మ (“దర్శనమ్” మాసపత్రిక) మాటల్లో….
భారతీయ సంఖ్యా శాస్త్రవేత్తలు నిర్దేశించిన సంఖ్యామానం ప్రకారం ప్రయుత అంటే పది లక్షలు. యజుర్వేద సంహితలో ఏక (1), దశ (10), శత (100), సహస్ర (1000), అయుత (పది వేలు), నియుత (లక్ష), ప్రయుత (పది లక్షలు), అర్బుద (కోటి), మయర్బుద (10కోట్లు), పరర్ధ (1,00కోట్లు), అంత (1,000కోట్లు) లాంటి అతిపెద్ద అంకెల ప్రస్తావన ఉన్నదని నందిరాజు రాధాకృష్ణగారు ఈ వివరాలు అందజేశారు. కేసీఆర్ చేస్తున్న చండీయాగాల పుణ్యమా అని ఏనాడో మరుగున పడిన లెక్కలు బయటకు రావడం ఒక రకంగా సంతోషించతగ్గ విషయం. ప్రతి దేశం తన సంస్కృతి, పురాతన శాస్త్రాలను పరమ పవిత్రంగా చూసుకుంటుంటే, మన దేశం పురాణ, ప్రాచీన శాస్త్ర పరమైన అంశాలను పట్టించుకోవడం మానేసింది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయ సంఖ్యా శాస్త్ర విశిష్టత కేసీఆర్ యాగాల ద్వారా అందరికీ తెలియడం ముదావహం.
ఆయుత చండీయాగం చేయడం అంటేనే ఓ సాహసం. దానికి వందరెట్లు అయిన ప్రయుత చండీయాగం చేస్తానని కేసీఆర్ ప్రకటించడం ఊహించని సాహసం. ఇది ఆయనలోని ఆధ్యాత్మిక బలాన్ని తెలియజేస్తున్నది. యాగకర్తకు అచంచలమైన విశ్వాసం, చెక్కుచెదరని ఆత్మబలం ఉండాలి. యాగం జరిగేటప్పుడు తలెత్తే అడ్డంకులను ఎదుర్కోగల ధైర్యమూ, మనో నిబ్బరం ఉండాలి. (అయుత చండీయాగం చేస్తున్నప్పుడు అగ్నిప్రమాదం చోటుచేసుకున్నప్పటికీ, కేసీఆర్ చాలా కూల్ గా కనిపించారు. అందరికీ ధైర్యం చెప్పారు)
ప్రయుత చండీ యాగం అంటే 10 లక్షల సప్తశతి పారాయణాలు పూరించి లక్ష హోమాలు నిర్వహించాలి. అయుత చండీయాగంలో వంద హామగుండాల్లో పూర్ణాహుతి ఇస్తారు. ఈ రకంగా చూస్తే ప్రయుత చండీయాగం ఎంతటి మహోన్నతమైనదో అర్థమవుతుంది. అయుత చండీయాగానికి వందరెట్లు గొప్పదైన ప్రయుత చండీయాగనికే కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
మెదక్ జిల్లా ఎర్రవెల్లిలో అయుత చండీయాగాన్ని లక్షలాది మంది భక్తులు చూసి తరించారు. ఐదురోజులపాటు ఎర్రవెల్లి ఓ మహా పుణ్యక్షేత్రంగా మారిపోయింది. అంతటా ఆధ్యాత్మిక శోభ కనిపించింది. ఇదంతా ఒక ఎత్తైతే, ఈ సందర్భంగా ప్రజలు కోరుకునేది ఒకటే – పాలకులు సన్మార్గంలో నడవాలని. పాలకుల్లో మార్పు రాకపోతే ఎలాంటి క్రతువులు చేసినా సామాన్యులకు వాటి ఫలాలు దక్కవు. ఈ యాగం పరిసమాప్తితో కేసీఆర్ తన పరిధిలోని పాలకులను ఏకతాటిమీదకు తీసుకురావాలి. ప్రజలు ఎమి కావాలని కోరుకుంటున్నారో వాటిని అందించడంలో రాజీపడబోమని చండీ అమ్మవారి సాక్షిగా పాలకులంతా ప్రమాణం చేయాలి. మరి అలాంటి ప్రయత్నాలు ఏవైనా జరుగుతాయోమో చూడాలి. మన సంకల్పం మంచిదైతే ఆపైన దైవ కృప ఉంటుందన్నదే అందరి నమ్మకం. మరి ఆ నమ్మకాన్ని `కేసీఆర్ జట్టు’ వొమ్ము చేయదనే ఆశిద్దాం.
– కణ్వస