ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల తరువాత మళ్ళీ కనబడలేదు. ఆ మధ్యన ఎప్పుడో ఆయన బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వినిపించాయి కానీ ఇంత వరకు ఏ రాజకీయపార్టీలోను చేరలేదు. కనీసం మీడియా కంటపడటం లేదు కూడా. రాష్ట్ర విభజన, దానిలో వివిధ రాజకీయ పార్టీలు, నేతల పాత్రల గురించి ఆయన ఒక పుస్తకం వ్రాస్తున్నట్లు సన్నిహితుల ద్వారా మీడియాకు ఒక వార్త చేరింది కానీ ఆ పుస్తకం కూడా ఇంతవరకు విడుదల చేయలేదు. ఆయన మళ్ళీ చాలా రోజుల తరువాత సోమవారం రాజమండ్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినప్పుడు మీడియా కంటపడ్డారు.కానీ ఆయన మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. ఆయనకు స్వాగతం పలికేందుకు మాజీ ఎంపి హర్షకుమార్ తన అనుచరులతో కలిసి వచ్చేరు.