దేశంలో నిరుపేదలతో సమానంగా ధనిక వర్గాల ప్రజలు వంట గ్యాస్ పై అనేక దశాబ్దాలుగా సబ్సిడీ పొందుతున్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ధనికవర్గాల ప్రజలు స్వచ్చందంగా తమ గ్యాస్ సబ్సీడీ వాడుకోవాలని పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 15 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులలో ఇంత వరకు 57.5 లక్షల మంది తమ గ్యాస్ సబ్సీడీని వదులుకొన్నారు. కనుక ఇంకా చాలా మంది ధనిక వర్గానికి చెందినవారు తమ గ్యాస్ సబ్సీడీ వదులుకొనేందుకు ఇష్టపడటం లేదు. అందుకే కేంద్రప్రభుత్వమే రూ. 10 లక్షల వార్షికాదాయం గలవారందరికీ 2016 నుండి గ్యాస్ సబ్సీడీ ఇవ్వకూడదని నిశ్చయించుకొంది.
వచ్చే నెల నుండి గ్యాస్ బుక్ చేసుకొనే సమయంలో వినియోగదారులు అందరూ ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారం తమ వార్షికాదాయం గురించి తమ గ్యాస్ ఏజన్సీకి ‘సెల్ఫ్ డిక్లరేషన్’ పత్రం ఇవ్వవలసి ఉంటుంది. రూ. 10 లక్షలు ఆపైన వార్షికాదాయం గల వారందరూ ఇక నుంచి ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం రూ.608 చెల్లించి గ్యాస్ కొనుగోలు చేసుకోవలసి ఉంటుంది. మిగిలిన వారికి అదే గ్యాస్ సిలిండరుపై రూ.188.74 సబ్సీడీతో రూ.419.26కి పొందవచ్చును.