బురఖా గురించి తన అభిప్రాయం చెప్పిన ఓ కేరళ యువకుడికి బతుకు తెరువే లేకుండా చేసిన వారిని ఇంత వరకూ పట్టుకోలేదు. నష్టపోయిన అతడికి పరిహారం ఇస్తామంటూ ప్రభుత్వం ఇంత వరకూ చెప్పలేదు. పైగా అతడే పెద్ద నేరస్తుడన్నట్టు ప్రకటనలు చేస్తున్నారు. మరి, అసహనం పేరుతో గత నెలలో అవార్డులను వాపస్ చేసిన పెద్దలు ఇప్పుడు ఎక్కడున్నారనేది ప్రశ్న.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జరిగే రోజుల్లో కొందరు మేధావులకు దేశం మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకువచ్చింది. కొన్ని ఘటనల వల్ల ఈ దేశం నాశనమవుతుందని ఆవేదన కలిగింది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన అవార్డులను వరస బెట్టి వాపస్ ఇచ్చారు. సాహిత్య అకాడమీ అవార్డులను తిప్పి పంపారు. ఇంకా ఇతర పురస్కారాలను తిరస్కరించారు. బీహార్ ఎన్నికలు అయిపోయాయి. అసహనం ముగిసిపోయింది.
రఫీక్ అనే యువకుడు కేరళలోని కన్నూర్ నివాసి. వృత్తిరీత్యా వీడియోగ్రాఫర్. కాస్త అభ్యుదయభావాలు గలవాడు. ఈరోజుల్లో బురఖాను చాలా మంది మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని రెండు రోజుల క్రితం కామెంట్ చేశాడు. షాపింగ్ కు వెళ్లిన మహిళలు బుఖాల మాటున విలువైన వస్తువులను దొంగిలిస్తున్నారని, కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో నిండా బురఖా ధరించడం ప్రమాదకరమని అభిప్రాయపడ్డాడు. వాట్ ఇస్లాం అనే పేరుతో ఫేస్ గ్రూప్ లో అతడి మిత్రులకు ఓ గ్రూప్ ఉంది. అందులో తన అభిప్రాయాలను పోస్ట్ చేశాడు. అంతే, కొందరు దుండగులు అతడి స్టూడియో మీద దాడి చేశారు. అందులోని పరికరాలను, ఫర్నిచర్ ను, అద్దాలను సమస్తం ధ్వంసం చేశారు.
రఫీక్ స్టుడియోపై దాడి జరిగి రెండు రోజులవుతున్నా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. కనీసం ఒక్కరినైనా అరెస్టు చేయలేదు. నిందితులను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారు.
ఇంతకీ అవార్డు వాపసీ మేధావులు, సెక్యులరిస్టులు, హిందూత్వను విమర్శించే కమ్యూనిస్టులు ఏమయ్యారో? సెక్యులరిజం అంటే అన్ని మతాలను సమానంగా చూడటం. కానీ వీరంతా హిందువలను వ్యతిరేకిస్తూ మైనారిటీలకు మాత్రం కొమ్ము కాస్తుంటారని ఆరెస్సెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పుడు రఫీక్ కు అండ ఎవరు? అతడికి కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చేది ఎవరు? ఇదే వ్యాఖ్యను హిందువులకు వ్యతిరేకంగా చేసి ఉంటే అవార్డు వాపసీ వారి బాటలో మరికొందరు పురస్కారాలను తిరస్కరించే వారు కాదా అనే ప్రశ్నకు జవాబు చెప్పేదెవరు?