(సెటైర్)
మయుడు తెగ బాధపడిపోతున్నాడు. అతని బాధంతా అమరావతి కోసమే ! రాజధాని నిర్మాణం కోసం ప్రధాన రూపశిల్పిగా తనకు గుర్తింపురానందుకు కుమిలికుమిలి పోతున్నాడు. గత కొద్దిరోజులుగా నిద్రలేదు. తిండి తినడు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఊసువచ్చినప్పుడు మయుడు తెగ సంబరపడిపోయాడు. ఎగిరిగంతేసినంత పనిచేశాడు. మహోన్నతమైన రాజధాని నిర్మించాలని ముచ్చటపడ్డాడు. ఆ ఛాన్స్ తనకే వస్తుందని అనుకున్నాడు. ఎందుకంటే, తనను మించిన శిల్పి మూడు లోకాల్లోనే కాదు, ముక్కోటి లోకాల్లోనూ లేడన్నది అతగాడి గట్టి నమ్మకం. అంతటి మహా ఘనుడైన రూపశిల్పి కనుకనే పోటీగీటీ లేకుండానే నేరుగా పిలిచి పనులు అప్పగిస్తారని అనుకున్నాడు. సీఎం చంద్రబాబు నుంచి పిలుపొస్తుందని ఎదురుచూశాడు. సాదరంగా తనను ఆహ్వానించి నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తారని ఎదురుచూశాడు. కానీ, బాబు ముందు పప్పులుడకలేదు. `ఈ విషయంలో ధర్మరాజుకంటే చంద్రబాబు మొండిఘటమ’ని మయుడు ఇప్పటికే ఏ వందసార్లో అనుకున్నాడు. అలా అనుకున్నప్పుడల్లా అతనికి ద్వాపరయుగంనాటి తన కీర్తిపతాక కళ్లముందు కనిపిస్తూనే ఉండేది. ఆ రోజుల్లో మయుడికి సాటి ఎవ్వరూ లేరు.
చక్రవర్తి దుతరాష్ట్రులవారు పాండవులను పిలిపించి, మీరు ఖాండవప్రస్థానికి వెళ్ళి అక్కడ సుఖంగా ఉండమని ఆదేశించాడు. పాపం, ఏం చేస్తారు… పెద్దనాన్న, పైగా చక్రవర్తి, ఇక చేసేదేముందీ, పాండవులు ఖాండవప్రస్థం వెళ్లారు. అక్కడకు వెళితే ఏముందీ, అంతా చెట్లూచేమలు, గుట్టలు పుట్టలు. నిజం చెప్పాలంటే అదో పెద్ద అడవి. జనవాసానికి యోగ్యమైనది ఏదైనా ఉన్నదా ? అంటే, అది జీవనది ఒక్కటే. ఈ ప్రాంతం పక్కనుంచే యమునా నది ప్రవహిస్తోంది. అలాంటి ప్రాంతంలో రాజధాని (ఇంద్రప్రస్థం) నిర్మించాలనుకున్నారు. పాండవులు రాజ్యాన్ని పాలించగలరేగానీ పెద్దపెద్ద భవనాలు నిర్మించడం వారివల్ల ఏమవుతుంది ? మహా శిల్పి ఎవరా? అని ఆలోచిస్తూ, శ్రీకృష్ణుడి సలహా అడిగారు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు ఏమాత్రం సంకోచించకుండా మయుడిపేరు చెప్పాడు. మయుడు మాత్రమే అద్భుతమైన నగరాలను నిర్మించగలడన్నది శ్రీకృష్ణులవారి నమ్మకం.
మయుడంటే సామాన్యమైన శిల్పికాదు. అప్పటికే దేవలోకంలో అనేక అద్భుత కట్టడాలు నిర్మించిన మహాశిల్పి. పైగా, విశ్వకర్మ ఐదుగురి పుత్రుల్లో ఒకడు. మను, త్వష్ట, దైవజ్ఞ, విశ్వజ్ఞలకు ఇతను సోదరుడు. వీరంతా మహా శిల్పకారులే. వీరిలో మయుడు మొదటి నుంచి విష్ణువుకు సంబంధించిన కట్టడాలు కట్టేవాడు. అందుకే శ్రీకృష్ణుడు తనకిష్టుడైన మయుడ్ని పిలిపించాడు. మయుడు వచ్చి చూశాడు. నిర్మాణం పని మొదలుపెట్టాడు. అత్యద్భుతంగా మయసభను నిర్మించాడు. అందులో దిగ్భ్రాంతి చెందే సరస్సులు, తటాకాలు, అద్దాలు, రత్నకచిత సింహాసనాలు…ఎలా ఎన్నో ఉన్నాయి. చివరకు ఈ మయసభను చూసి దుర్యోధనాదులు అసూయపడ్డారు. అటుపై భంగపడ్డారు.
అలాంటి మయుడు ఇప్పుడు తెగ బాధపడిపోతున్నాడు. మయసభను నిర్మించిన తననే ఎవ్వరూ తలచుకోవడంలేదన్నది అతగాడి దిగులు. రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రధాన శిల్పిగా ఉండాలని మయుడు తెగ ముచ్చట పడ్డాడు. శ్రీకృష్ణుడంతటి వాడే తనను నేరుగా పిలిచి పని అప్పగిస్తే, ఈ ఏపీ వాళ్లు పోటీ పెడతామనేసరికి మయుడు డీలాపడిపోయాడు. పైగా, మనదేశంలో శిల్పులు తక్కువైనట్లు విదేశీ శిల్పులను రప్పించాలనుకోవడం మరింత బాధ కలిగించింది. ఇద్దరు విదేశీ శిల్పులను, ఒకరు భారతీయ శిల్పిని ఎంపిక చేసి వారిమధ్య పోటీపెట్టి ఉత్తమ కాన్సెప్ట్ ని ఎంపిక చేస్తామనడం మయుడికి నచ్చలేదు. కృష్ణానది పక్కన నాటి మయసభలాంటి భవన నిర్మాణం చేద్దామని అనుకున్న మయుడు చివరకు నిరుత్సాహపడ్డాడు. చివరకు ఏ `గాలి’ శిల్పికో పట్టం కడతారన్న విషయం అతనికి సూచనప్రాయంగా అర్థమైంది. విదేశీ శిల్పులు అద్భుతాలు సృష్టిస్తారనుకోవడం భ్రమ అన్న సంగతి మయుడికి తెలుసు. కానీ, చంద్రబాబు అండి హిజ్ టీమ్ కి తెలియడంలేదన్నదే ఇతగాడి బాధ. మాస్టర్ ప్లాన్ దగ్గర నుంచే `సింగపూర్…జపాన్’ అంటూ కలవరించేవాళ్లకు తన ప్రతిభాపాటవాలు చెప్పినా అర్థం కావని అనుకుంటూ మయుడు బాధాతప్త హృదయంతో అంతర్థానమైపోయాడు.
– కణ్వస