హైదరాబాద్: రాయలసీమను రతనాలసీమగా మార్చే బాధ్యతను తెలుగుదేశం పార్టీ తీసుకుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. అనంతపురంలో ఇవాళ జరిగిన నీరు-ప్రగతి కార్యక్రమలో చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ పాల్గొన్నారు. నీరు-ప్రగతి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించిన తర్వాత అక్కడ జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. కరువును చూసి భయపడకూడదని, కరువే మనల్ని చూసి భయపడాలని అన్నారు. నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టామని, పొలాల్లో కుంటలు తవ్వటానికి ప్రాధాన్యం ఇచ్చామని చెప్పారు. పంట సంజీవని పేరుతో అనంతపురం జిల్లాలో లక్ష ఫాం పాండ్స్ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎక్కడ నీటివనరులు ఉంటే అక్కడ చెక్ డ్యామ్‌లు, ప్రాజెక్టులు నిర్మించుకోవాలని అన్నారు. గోదావరి నీరు రావాలన్నా, మరే నది నీరు రావాలన్నా ఖర్చు అవుతుందని చెప్పారు. నీరు ప్రాణాధారమని, అందుకే నదుల అనుసంధానంపై దృష్టి పెట్టామని అన్నారు. ఎక్కడో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును విద్యుత్తు లైన్ల ద్వారా అందిస్తున్నట్లు నీటిని కూడా అనుసంధానం చేయాలన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు. రైతుల రుణ విముక్తికోసం రు.24,000 కోట్లు ఖర్చుపెడుతున్నామని తెలిపారు. అనంతపురం జిల్లా హార్టీకల్చరల్ హబ్‌గా మారుతుందని చంద్రబాబు అన్నారు. భూగర్భ జలాలను పెంచుకోవటంపై దృష్టిపెట్టాలని రైతులకు సూచించారు.