హైదరాబాద్: శ్రీమంతుడు చిత్రాన్ని అందించిన మైత్రి మూవీస్ మేకర్స్వారు కొరటాల శివ దర్శకత్వంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘జనతా గ్యారేజ్’ అనే చిత్రాన్ని తీయబోతున్న సంగతి తెలిసిందే. గత నెలలో లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులలో ఉంది. సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా, మోహన్‌లాల్ ఒక ప్రత్యేకపాత్రలో నటిస్తున్నారు. ఫిబ్రవరిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుండగా జగపతిబాబు ఈ చిత్ర కథను బయటకు చెప్పేశారు. నాన్నకు ప్రేమతో ఆడియో విడుదల కార్యక్రమంలో మాట్లాడుతూ, తనకు అన్నీ రిచ్ ఫాదర్ పాత్రలే వస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ‘నాన్నకు ప్రేమతో’ అయ్యింది, మీరందరూ అల్లుడికి ప్రేమతో కోసం రెడీ అవ్వండి అని అభిమానులకు చెప్పారు. ఇది గుర్తు పెట్టుకోవాలని, తర్వాత మాట్లాడదాం అని కూడా అన్నారు. జనతా గ్యారేజ్‌లో తన పాత్రను ఉద్దేశించి జగపతిబాబు ఈ మాటలన్నట్లు స్పష్టమవుతోంది. హీరోయిన్ తండ్రిగా జగపతిబాబు రిచ్ ఫాదర్ పాత్ర పోషిస్తున్నట్లు కూడా అర్థమవుతోంది. టైటిల్ ఎలాగూ ‘జనతా గ్యారేజ్’ కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ పేద మెకానిక్ పాత్ర పోషిస్తున్నాడని కూడా తెలుస్తూనే ఉంది. పేద హీరోకు, రిచ్ హీరోయిన్ తండ్రికీ క్లాష్ ఉండటం మామూలే కదా. అదీ కథ.
జగపతిబాబు జూనియర్ ఎన్టీఆర్ రహస్యాలను కూడా బయటపెట్టేశారు. తారక్ ఎనర్జీ లెవల్స్, తన డిసిప్లిన్ వేరుగా ఉంటుందని అన్నారు. హి ఈజ్ ఎ ఫెంటాస్టిక్ యాక్టర్ అని చెప్పారు. వెరీ గుడ్, వెరీ టేలెంటెడ్ అన్నారు. టేలెంట్తోపాటు విపరీతమైన అల్లరి ఉందని, అందర్నీ ఆటపట్టిస్తుంటాడని చెప్పారు. పగలంతా ఎంజాయ్ చేస్తా ఉంటామని, మళ్ళీ ఈవెనింగ్ ప్యాకప్ అవగానే, ఫాలో ఫాలో అంటూ తన వెనకాలే వెళ్ళి రూమ్‌లో సెటిలైపోయేవాళ్ళమని అన్నారు. అక్కడ కూడా తనొక్కడే మాట్లాడతాడని, ఇంకెవరకీ మాట్లాడే ఛాన్స్ ఇవ్వడని, అంత ఎనర్జీ ఉంటుందని చెప్పారు. రూమ్‌లో సెటిలైపోయి చేసేది ఏమిటో విడమర్చి చెప్పనవసరం లేదు కదా!